కేసీఆర్ తరచుగా ప్రశాంత్ కిశోర్ తో కలుస్తున్నారు: రఘునందన్ రావు
- కేసీఆర్ మాట్లాడుతున్న భాష సరిగా లేదు
- బూతులు మాట్లాడే వ్యక్తి సీఎం పదవిలో ఉండటం సరైనదేనా?
- నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సిద్ధంగా లేదనే కేసీఆర్ కక్ష కట్టారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్న భాష సరిగా లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని… కేంద్రం చేసిన తప్పు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కేసీఆర్ దూషించడం తెలంగాణ సమాజం తల దించుకునేలా ఉందని అన్నారు. బూతులు మాట్లాడే వ్యక్తి సీఎం పదవిలో ఉండటం సరైనదేనా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇటీవలి కాలంలో ప్రశాంత్ కిశోర్ తో తరచూ కలుస్తున్నారని… ఆయన సూచనల మేరకే భౌతిక దాడులు, ఆందోళనలకు కేసీఆర్ దిగుతున్నారని చెప్పారు.
నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సిద్ధంగా లేదనే కేసీఆర్ కక్ష కట్టారని… డీలిమిటేషన్ అయితే పార్టీలో మరికొంత మందికి టికెట్లు ఇవ్వొచ్చనేది కేసీఆర్ ఆలోచన అని రఘునందన్ రావు అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే భయం కేసీఆర్ లో ఉందని చెప్పారు. హిందువుల గురించి మాట్లాడితే మతతత్వం అంటున్నారని విమర్శించారు. పాలమూరుకు కేసీఆర్ ఎన్ని నీళ్లు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.