ఉద్యోగాలకు డిమాండ్ ఉన్నా భారీగా పడిపోయిన హెచ్1బీ వీసాలు..
- గత ఏడాదితో పోలిస్తే 12 శాతం తగ్గిన ఇంజనీరింగ్, మ్యాథ్స్ జాబ్ ల వీసాలు
- అన్ని జాబ్ లకు కలిపి ఈ ఏడాది 4.97 లక్షల వీసాలు
- 2020తో పోలిస్తే 9 శాతం తగ్గుదల
- లాక్ డౌన్లు, ట్రావెల్, వీసా ఆంక్షలు, వీసా ప్రాసెసింగ్ లేట్ అవడమే కారణాలు
జాబులకు డిమాండ్ బాగానే ఉంది.. సంస్థలకు ఉద్యోగులూ కావాలి.. కానీ, ఈ ఏడాది హెచ్1బీ వీసాలు మాత్రం భారీగా పడిపోయాయి. ఈ దశాబ్దంలోనే అత్యంత తక్కువ దరఖాస్తులు వచ్చాయి. దానికీ కారణం లేకపోలేదు. కరోనా ముప్పు నేపథ్యంలో అమెరికా ప్రయాణ ఆంక్షలు విధించడం, వీసాలపై పరిమితులు పెట్టడం, లాక్ డౌన్ల వంటి కారణాలతో హెచ్1బీ వీసాలు తగ్గాయి.
విదేశీ ఇంజనీరింగ్, మ్యాథ్స్ ఉద్యోగుల హెచ్1బీ వీసాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 12.6 శాతం తగ్గాయి. ఏటా ఈ రంగంలో ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నా.. ఈ ఏడాది మాత్రం వీసాలు తగ్గడం గమనార్హం. కరోనా కేసులు పెరుగుతుండడంతో విధించిన లాక్ డౌన్లు, కఠినమైన వలస విధానాల వల్ల వీసా ప్రాసెసింగ్ లేట్ అవుతోందని, దాని వల్లే ఈ సారి హెచ్1బీ వీసాలు తగ్గాయని నిపుణులు చెబుతున్నారు.
2019లో కరోనా ముందునాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ఇంజనీరింగ్, మ్యాథ్స్ సెక్టార్ లో హెచ్1బీ ఉపాధి వీసాలు 19 శాతం పడిపోయాయని పేర్కొంటున్నారు. సెప్టెంబర్ నాటికి పూర్తయిన అమెరికా ఆర్థిక సంవత్సరంలో అన్ని ఉద్యోగాలకు సంబంధించి 4.97 లక్షల వీసాలు ఇచ్చారని, 2020తో పోలిస్తే 9 శాతం, 2019తో పోలిస్తే 17 శాతం తగ్గాయి.
ప్రధానమైన కోర్సులుగా చెప్పుకొనే స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్)కు సంబంధించిన ఉద్యోగాల వీసాలే భారీగా తగ్గాయని, 2020 మార్చి నుంచి గణనీయంగా పడిపోయాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఎకనామిక్స్ ప్రొఫెసర్ జియోవానీ పెరి చెప్పారు. చాలా చోట్ల వీసా ప్రాసెసింగ్ సెంటర్లు మొదలైనా.. తక్కువ మంది ఉద్యోగులతో పని నడిపిస్తున్నారని చెప్పారు.