మహాప్రస్థానంలో ముగిసిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అంత్యక్రియలు…
-జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు
-ఆచారం ప్రకారం అంత్యక్రియలు
-కన్నీటిపర్యంతమైన అభిమానులు, సన్నిహితులు
-కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం
లెజెండరీ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కడసారి వీడ్కోలు నడుమ హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానం శ్మశానవాటికలో సిరివెన్నెల అంత్యక్రియలు ముగిశాయి. ఆచార సంప్రదాయాల ప్రకారం ఆయన భౌతికకాయాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు, ఆయనతో సాన్నిహిత్యం ఉన్న వారి వేదన వర్ణనాతీతం.
న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల… కొంతకాలం కిందట లంగ్ క్యాన్సర్ బారినపడ్డారు. చికిత్స చేసినప్పటికీ మరో ఊపిరితిత్తికి క్యాన్సర్ వ్యాపించింది. దానికితోడు ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఇటీవల అనారోగ్యం తిరగబెట్టడంతో ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కానీ పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.
సిరివెన్నెల కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి పేర్ని నాని
నివాళి అర్పించిన ఏపీ మంత్రి పేర్ని నాని
తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి అని కితాబు
టాలీవుడ్ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ప్రముఖులు, అభిమానులు ఘననివాళులు అర్పిస్తున్నారు. ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ ఫిలించాంబర్ వద్ద ఉంచిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తరఫున రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని కూడా నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ, తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి సిరివెన్నెల అని కొనియాడారు. ఆయన మృతి అత్యంత విచారకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఏపీ ప్రజల తరఫున సిరివెన్నెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా సిరివెన్నెల కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి పేర్ని నాని… వారికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.