Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భువనేశ్వరికి వంశీ క్షమాపణ-ఆవ్యాఖ్యలు పొరపాటే: చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మలుపు. తన సతీమణిని దూషించారంటూ చంద్రబాబు అసెంబ్లీని బషిష్కరించడం ఆపై కన్నీరు పెట్టడం రాష్ట్రంలోనే కాక జాతీయ స్థాయిలో సైతం చర్చకు కారణమైంది.తాను తిరిగి సీఎం అయ్యేవరకు ఈ సభలో అడుగుపెట్టనంటూ ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు… శాసనసభకు దూరంగా ఉన్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం తాము చంద్రబాబు సతీమణి పేరు ఎత్తలేదని అసెంబ్లీలో కానీ, బయటగానీ కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావించలేదని చెబుతూ వచ్చారు.

ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో మరో ట్విస్టు చోటుచేసుకుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరకు చెందిన కౌన్సిలర్ మల్లాది వాసు కార్తీక వనభోజనాల్లో భాగంగా కమ్మ సామాజిక వర్గం చెందిన వారితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కొడాలినాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబులను నిర్మూలించాలని అందుకు ఎవరైనా ముందుకొస్తే తనవంతుగా రూ.50 లక్షలు ఇస్తానని వచ్చారు. ఈ వ్యాఖ్యలు రచ్చరచ్చకు కారణమయ్యాయి. ఈ సమయంలో ఒక టీవీ ఛానెల్ చర్చలో వల్లభనేని వంశీ స్పందించారు. వాసు వ్యాఖ్యలపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.

అదే సమయంలో తాను ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భువనేశ్వరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. దీనికి స్పందనగా తాను చేసిన వ్యాఖ్యలపైన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను నందమూరి ఫ్యామిలీలో భువనేశ్వరిని అత్యంతగా గౌరవిస్తానని, ఆమె అంటే చాలా అభిమానమని వంశీ చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యల పట్ల భువనేశ్వరితో సహా ఎవరైనా బాధపడి ఉంటే అందరికీ క్షమాపణలంటూ వంశీ తన పొరపాటును సరిదిద్దుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం ముగిసిపోవాలని కోరుకుంటూనే తమ పైన గతంలో సోషల్ మీడియా వేదికగా వేధించిన తీరు తమ కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననం గురించి వంశీ చెప్పుకొచ్చారు. తాను చేసిన వ్యాఖ్యల పైన చింతిస్తున్నానని అదే విధంగా తన కుటుంబం గురించి మాట్లాడిన వారు సైతం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ చర్చలోనే కొనసాగింపుగా చేరి మాట్లాడిన మంత్రి కొడాలి నాని… వంశీ క్షమాపణ చెప్పాడు కాబట్టి ఇక దాని గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని అందరితో తమను తమ పార్టీ నేతలను తిట్టించిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ కొడాలి నాని డిమాండ్ చేశారు. ఆకస్మికంగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో ఈ వివాదం ముగుస్తుందా లేక చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌తో మళ్లీ రాజకీయం అగ్గిరాజుకుంటుందా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారుతోంది.

Related posts

వైయస్ జగన్ తిరుమల పర్యటన అడ్డుకుంటామన్న స్వామీజీలు !

Ram Narayana

పోలవరం పోటుతో భద్రాచలానికి పొంచిఉన్న ముప్పు…

Drukpadam

రాదనుకున్న ఆస్తి వందేళ్ల తర్వాత ఇప్పుడు చేతికొచ్చింది.. దాని విలువిప్పుడు రూ.556 కోట్లు!

Drukpadam

Leave a Comment