పార్లమెంట్ భవనం ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఎందుకు పిలవడంలేదు …కమల్ హాసన్ ..

నూతన పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఎందుకు పిలవడంలేదు?: మోదీని నిలదీసిన కమలహాసన్

  • మే 28న ఢిల్లీలో నూతన పార్లమెంటు ప్రారంభోత్సవం
  • ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  • రాష్ట్రపతి ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడంపై కారణమేమీ కనిపించడంలేదన్న కమల్  

దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రేపు (మే 28) ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే, అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి పిలవకుండా, ప్రధాని మోదీనే ప్రారంభోత్సవం చేస్తుండడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి.

తాజాగా, సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమలహాసన్ కూడా ఈ అంశంపై స్పందించారు. జాతికి గర్వకారణంగా భావించాల్సిన ఈ క్షణాలు రాజకీయ విభజనకు దారితీశాయని విమర్శించారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఎందుకు పిలవడంలేదు అని మోదీని సూటిగా ప్రశ్నించారు.

దేశాధినేతగా ఉన్న వ్యక్తి చారిత్రక కార్యక్రమంలో పాల్గొనకపోవడానికి తనకేమీ కారణం కనిపించడంలేదని కమల్ పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల రీత్యా కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని తాను ఆమోదిస్తానని, కానీ రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం, విపక్షాలకు ప్రారంభోత్సవ కార్యక్రమ ప్రణాళికలతో తగిన స్థానం కల్పించకపోవడంపై తన అసంతృప్తిని కొనసాగిస్తానని కమలహాసన్ స్పష్టం చేశారు.

Leave a Reply

%d bloggers like this: