ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోని కేసీఆర్!
- ముగిసిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
- 90 శాతానికి పైగా పోలింగ్ నమోదు
- మెదక్ జిల్లా నుంచి ఎక్స్ అఫీషియో ఓటరుగా ఉన్న కేసీఆర్
తెలంగాణలో 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. మొత్తమ్మీద దాదాపు 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. సిద్ధిపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, తూప్రాన్ పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం పోలింగ్ నమోదైంది. మెదక్ జిల్లా నుంచి ఎక్స్ అఫీషియో ఓటరుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. మొత్తం 12 స్థానాలకు గాను ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా… ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
తెలంగాణలో ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
- 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్
- 5 జిల్లాల పరిధిలో ఎన్నికలు
- ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్
- ఈ నెల 14న ఓట్ల లెక్కింపు
రాష్ట్రంలోని 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. కాగా నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు సమాప్తమైంది. కరీంనగర్ జిల్లాలో 2, ఆదిలాబాద్ జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 1, ఖమ్మం జిల్లాలో 1, మెదక్ జిల్లాలో 1 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్ నిర్వహించారు.
5 జిల్లాల పరిధిలో ఈ పోలింగ్ నిర్వహించారు. అత్యధికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 99.69 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. కరీంనగర్ జిల్లాలో 1,324 ఓట్లు ఉండగా, నాలుగు ఓట్లు తప్ప మిగతావి అన్నీ పోలయ్యాయి.
హరీశ్ రావుపై జగ్గారెడ్డి సెటైర్లు
- ట్రబుల్ షూటర్ హరీశ్ ట్రబుల్ లో ఉన్నారు
- ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్మల బరిలో ఉండటంతో చాలా ఇబ్బంది పడ్డారు
- నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదే
టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన మంత్రి హరీశ్ రావు ట్రబుల్స్ లో ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్మల జగ్గారెడ్డి పోటీలో ఉండటంతో హరీశ్ రావు ఇబ్బందిపడ్డారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగడంతో… స్థానికంగా ఉన్న నేతలను హరీశ్ రావు సొంత బిడ్డలుగా, సొంత అల్లుళ్లుగా చూసుకున్నారని వ్యంగ్యంగా అన్నారు. ఏదేమైనా ఉమ్మడి మెదక్ జిల్లాలో నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. టీఆర్ఎస్ మాదిరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడా క్యాంపులు పెట్టలేదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి 700లకు పైగా ఓట్లు ఉండి కూడా క్యాంపులు పెట్టిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు ఉన్న 230 ఓట్లతో పాటు మరో 170 ఓట్లు వస్తాయని భావిస్తున్నామని చెప్పారు