కనిపించని పులి జక్కన్న.. పరిచయమున్న పులి కాబట్టి కాస్త గట్టిగానే అరిచా: ఎన్టీఆర్!
- మలయాళం తప్ప అన్నింటికీ నేనే డబ్బింగ్ చెప్పా
- మలయాళంలో చెప్పేందుకు ప్రయత్నించా
- ఖూనీ చేస్తున్నట్టనిపించడంతో జక్కన్న వారించారు
ఒక్క మలయాళం తప్ప మిగతా నాలుగు భాషల్లోనూ తానే డబ్బింగ్ చెప్పుకొన్నానని తారక్ తెలిపారు. మలయాళంలో చెప్పడానికి ప్రయత్నించినా.. ఖూనీ చేస్తున్నట్టు అనిపించిందని, దీంతో జక్కన్న వద్దని వారించడంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నానని అన్నారు. మలయాళ నటులతోనే డబ్బింగ్ చెప్పించామన్నారు. డబ్బింగ్ విషయంలో తమకు ఎక్కడా కష్టం అనిపించలేదని, కొన్ని భాషలకు ట్రైనర్లను ఏర్పాటు చేశారని తెలిపారు.
ప్రతి జీవికీ ఓ ఆశ ఉంటుందని, అదే అందరినీ నడిపిస్తుంటుందని తారక్ చెప్పారు. ఆ ఆశతోనే రాజమౌళి కన్న కలను సాకారం చేసేందుకు జోష్ తో పనిచేశామన్నారు. కరోనాకు ముందు ఎంత ఉత్సాహంతో ఉన్నామో.. అంతే ఉత్సాహంతో చిత్రాన్ని ప్రారంభించామని, కరోనాతో డీలా పడినా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అందరికీ అందించాలన్న ఉద్దేశంతోనే అందరం కష్టపడి పనిచేశామని చరణ్ చెప్పారు.
సినిమాలో కనిపించని పులి (పులి సీన్ గురించి మాట్లాడుతూ) జక్కన్న అని తారక్ అన్నారు. పరిచయమున్న పులి కాబట్టే తానూ ఓ పెద్ద అరుపు అరిచానని ఆయన నవ్వేశారు. కొమురం భీం పాత్ర కోసం ఎంతో శ్రమించానని చెప్పుకొచ్చారు. ఆయన ఆలోచనా విధానం, ప్రవర్తన, శారీరక, మానసిక అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపారు. ఈ విషయంలో దర్శకుడే అన్ని విధాలా సాయం చేశారని తారక్ చెప్పారు. ఈ సినిమా కోసం కాస్త ఎక్కువగా శ్రమించానన్నారు. ఇది పాన్ ఇండియా సినిమా అని ముందుగా తనకు తెలియదని, షూటింగ్ మొదలయ్యాకే రాజమౌళి చెప్పారని అన్నారు.
గొడవైతే విడిపోతాం.. నటిస్తూ బతకడం నాకు, తారక్ కు చేతకాదు: చరణ్
- సినిమా వల్ల మేం స్నేహితులం కాలేదు
- ముందు నుంచీ మేం మంచి మిత్రులం
- అలియాతో నటించేటప్పుడు తారక్ కంగారు పడ్డాడు
చాలా రోజుల తర్వాత హీరోయిన్ తో నటిస్తుండడంతో తారక్ కంగారుపడిపోయాడని చరణ్ అన్నారు. తానేమో అల్లూరి సీతారామరాజు పాత్రలో లీనమైపోయానని, సరదాగా మాట్లాడలేకపోయానని చెప్పారు. అలియా మంచి నటి అని, ఆమె స్థాయికి తగ్గట్టు నటించాలని అనుకున్నానని తెలిపారు. తాను కూడా ఎంతో ఇబ్బంది పడ్డానని, ఆమె నటనకు తాను సెట్ అవగలనా? అంటూ కంగారు పడ్డానని అన్నారు. దానికి అలియా స్పందిస్తూ వారికి బిర్యానీ ఇప్పించడం వల్లే తనను పొగుడుతూ మాట్లాడుతున్నారంటూ జోక్ చేశారు.