దేశ విభజనపై రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలను సమర్థించిన ఫరూఖ్ అబ్దుల్లా!
- దేశాన్ని మతం ప్రాతిపదికగా విభజించడం చారిత్రక తప్పిదమన్న రాజ్‌నాథ్
- కచ్చితంగా అవునన్న ఫరూఖ్ అబ్దుల్లా
- నాడు అలా జరగకపోయి ఉంటే దేశం మరింత శక్తిమంతంగా ఉండేదని వ్యాఖ్య
దేశ విభజనపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను నేషనల్ కాన్ఫెరెన్స్ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా సమర్థించారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న ‘స్వర్ణిమ్ విజయ్ పర్వ్’ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం మాట్లాడుతూ.. దేశాన్ని మతం ప్రాతిపదికన విభజించడాన్ని చారిత్రక తప్పిదంగా పేర్కొన్నారు. 1971 యుద్ధం ఇందుకు నిదర్శనమని అన్నారు. భారత్‌ను ముక్కలు చేయాలన్న దురుద్దేశంతో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.
రాజ్‌నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలను ఫరూఖ్ అబ్దుల్లా సమర్థించారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ విభజన కనుక జరగకపోయి ఉంటే హిందూ, ముస్లిం వర్గాలు రెండూ శాంతియుతంగా ఉండేవని, ఫలితంగా దేశం మరింత శక్తిమంతంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. మతం ప్రాతిపదికన దేశాన్ని విభజించడం కచ్చితంగా చారిత్రక తప్పిదమేనని అన్నారు.
అప్పట్లో ముస్లింలకు 26 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిన చోట 39 శాతం ఇవ్వాలని జిన్నా పట్టుబట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అందుకు నిరాకరించడంతో జిన్నా దేశ విభజనను కోరుకున్నారని అన్నారు. నాడు అలా జరగకపోయి ఉంటే మనమంతా ఇప్పుడు ఐక్యంగా సోదరభావంతో ఉండేవాళ్లమని అన్నారు. భారత్-పాక్ మధ్య విభేదాల కారణంగా ఇప్పుడు మతపరమైన సమస్యలు మరింతగా పెరుగుతున్నాయని ఫరూఖ్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు.