Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్ల రగడ …

ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్ల రగడ …
టిక్కెట్ల రేట్లు తగ్గించాల్సిందే ప్రభుత్వం …ప్రభుత్వ నిర్ణయం సరైందికాదు నాని
ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచుకుంటామంటే కుదరదు: మంత్రి బొత్స
ముదురుతున్న సినిమా టికెట్ల వ్యవహారం
టికెట్ రేట్ల తగ్గింపుపై టాలీవుడ్ ప్రముఖుల స్పందనలు
బాహాటంగా అసంతృప్తి వెలిబుచ్చిన నాని
ఇందులో ప్రేక్షకులను అవమానించడం ఏముందన్న మంత్రి

ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం మరింత ముదురుతోంది. సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవడం పట్ల టాలీవుడ్ నుంచి బాహాటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నేడు హీరో నాని చేసిన వ్యాఖ్యలతో వాతావరణం వేడెక్కింది. సినిమా టికెట్ ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించడంపై సినీ హీరో నాని బహిరంగంగానే అసహనాన్ని వ్యక్తం చేశాడు. ప్రభుత్వ నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రబృందం ఈరోజు మీడియా సమావేశాన్ని నిర్వహించింది.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ… సినిమా టికెట్ల ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించిందని, ఇది సరైన నిర్ణయం కాదని అన్నాడు. టికెట్ ధరలను తగ్గించడం ద్వారా ప్రేక్షకులను ప్రభుత్వం అవమానించిందని పేర్కొన్నాడు. సినిమా థియేటర్ల కంటే పక్కనున్న కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్లు ఉన్నాయని చెప్పాడు. టికెట్ ధర ఎక్కువగా ఉన్నా కొని, సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని అన్నాడు. అయినా, ఇప్పుడు తాను ఏది మాట్లాడినా వివాదాస్పదమే అవుతుందని నాని అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కాస్త ఘాటుగానే స్పందించారు.

ఇష్టం వచ్చినట్టు సినిమా టికెట్ల రేట్లు పెంచుకుంటామంటే కుదరదు అని బొత్స స్పష్టం చేశారు. మేమింతే… మా ఇష్టం వచ్చిన రేట్లకు టికెట్లు అమ్ముకుంటాం అంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే జిల్లాల స్థాయిలో అధికారులకు నివేదించాలని, ప్రభుత్వం పరిశీలిస్తుందని బొత్స పేర్కొన్నారు. మీకు నచ్చిన రేట్లకు సినిమా టికెట్లు అమ్ముకునేందుకు అనుతిస్తే ఒత్తిళ్లు లేనట్టా…! ధరలు నియంత్రిస్తే ఒత్తిళ్లు ఉన్నట్టా…! అని నిలదీశారు.

సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే సినిమా టికెట్ల ధరలు తగ్గించామని, ఇందులో ప్రేక్షకులను అవమానించడం ఏముంది? అని ప్రశ్నించారు. మార్కెట్లో వస్తువులకు ప్రతిదానికి ఎమ్మార్పీ అనేది ఉంటుందని, ఆ పరిమితికి మించి అమ్మకూడదు కదా! అంటూ హితవు పలికారు.

నాని మాదిరి టాలీవుడ్ కు చెందిన పెద్ద హీరోలు కూడా మాట్లాడాలి: టీడీపీ నాయకురాలు అనిత

ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై సినీ హీరో నాని మాట్లాడటం మంచి పరిణామమని, అభినందించదగ్గ విషయమని టీడీపీ నాయకురాలు అనిత అన్నారు. సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని నాని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అనిత మాట్లాడుతూ… నాని మాదిరి టాలీవుడ్ కు చెందిన పెద్ద హీరోలు మాట్లాడాలని అన్నారు. పెద్ద హీరోలు విజయవాడకు వచ్చి సీఎం జగన్ ను, మంత్రి పేర్ని నానిని కలిసి వెళ్లడం కాదని… పరిశ్రమకు జరుగుతున్న అన్యాయంపై ధైర్యంగా మాట్లాడాలని సూచించారు.

సినిమా టికెట్ల అంశంలో హీరో నాని వ్యాఖ్యలను తప్పుబట్టిన టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్
నాని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్న నట్టి కుమార్
ఏపీ ప్రభుత్వానికి నాని క్షమాపణలు చెప్పాలని స్పష్టీకరణ

ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుతో పాటు థియేటర్లపై తనిఖీలు జరుగుతుండడం, పలు థియేటర్ల మూసివేత తదితర అంశాలు టాలీవుడ్ లో అసంతృప్తి జ్వాలలు రగుల్చుతున్నాయి. నేచురల్ స్టార్ నాని కూడా తన అసహనాన్ని వెలిబుచ్చడం తెలిసిందే. సినిమా థియేటర్ల కంటే కిరాణా షాపుల కలెక్షన్లే బాగున్నాయని, టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం సముచితం కాదని నాని పేర్కొన్నారు.

కాగా, నాని వ్యాఖ్యలను టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ తప్పుబట్టారు. నానికి ఏం తెలుసని మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. నాని వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. టికెట్ల రేట్లు, వసూళ్లు, షేర్ వంటి విషయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు.

ఓవైపు తాము ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, అటు, కోర్టులోనూ ఈ వ్యవహారం నడుస్తోందని అన్నారు. ఇలాంటి సమయంలో నాని వ్యాఖ్యల వల్ల మిగతా సినిమాలపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. నాని తన వ్యాఖ్యలపై ఏపీ సర్కారుకు క్షమాపణలు చెప్పాలని నట్టి కుమార్ డిమాండ్ చేశారు.

Related posts

తాలిబన్లతో కలిసి పని చేసేందుకు సిద్ధమంటూ బ్రిటన్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

బీజేపీకి చంద్రబాబు వెన్నుపోటు పొడిచి వెళ్లారు: సునీల్ దేవధర్…

Drukpadam

Here Are 8 Editors-Approved IGK Hair Products You Need to Try

Drukpadam

Leave a Comment