పరస్పర అంగీకారంతో శారీరకంగా కలిసి.. ఆపై పెళ్లికి నిరాకరించడం మోసం కాదు: బాంబే హైకోర్టు కీలక తీర్పు!
- 25 ఏళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడిన నిందితుడు
- పెళ్లికి నిరాకరించడం సెక్షన్ 417 ప్రకారం నేరం కాదన్న న్యాయస్థానం
- అదనపు న్యాయమూర్తి తీర్పును కొట్టేసిన ఉన్నత న్యాయస్థానం
శారీరక సంబంధం.. పెళ్లికి నిరాకరించడం వంటి విషయాల్లో బాంబే హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకుని, ఆపై పెళ్లికి నిరాకరించడం మోసం చేసినట్టు కాదని ఓ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, ఇలాంటి కేసులో 25 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది. పెళ్లి చేసుకుంటానన్న హామీతోనే అతడు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. నిజానికి పెళ్లికి నిరాకరించడం సెక్షన్ 417 కింద నేరం కాదని పేర్కొంది.
ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పాల్గఢ్‌కు చెందిన వ్యక్తి తనతో శారీరక సంబంధం పెట్టుకుని, ఆపై పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడంటూ 1996లో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ అనంతరం మూడేళ్ల తర్వాత పాల్గఢ్ అదనపు న్యాయమూర్తి నిందితుడిని దోషిగా తేల్చి ఏడాది జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించారు.
ఈ తీర్పును నిందితుడు బాంబే హైకోర్టులో సవాలు చేశాడు. తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. వారిద్దరూ పరస్పర అంగీకారంతోనే శారీరక సంబంధం పెట్టుకున్నట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయని, అయితే, ఆమెను వివాహం చేసుకునే ఉద్దేశం అతడికి ఉన్నట్టు ఎలాంటి సాక్ష్యాలు లేవని తేల్చి చెప్పింది. ఫలితంగా 25 సంవత్సరాల తర్వాత నిందితుడు నిర్దోషిగా బయటపడ్డాడు.