Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విడాకుల కేసులో ఇజ్రాయెల్ కోర్టు విచిత్రమైన తీర్పు..

విడాకుల కేసులో ఇజ్రాయెల్ కోర్టు విచిత్రమైన తీర్పు.. 8 వేల ఏళ్ల పాటు దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశం!

  • భార్యను బుజ్జగించేందుకు ఇజ్రాయెల్ వెళ్లి ఇరుక్కుపోయిన ఆస్ట్రేలియా భర్త
  • భరణంగా 3 మిలియన్ డాలర్లు చెల్లించేంత వరకు దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని ఆదేశం
  • 31 డిసెంబరు 9999 వరకు దేశంలో ఉండాలని తీర్పు
  • కోర్టు తీర్పుపై సర్వత్ర విస్మయం

విడాకుల కేసులో ఇజ్రాయెల్ కోర్టు ఇచ్చిన విచిత్రమైన తీర్పు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 8 వేల ఏళ్లపాటు దేశం విడిచివెళ్లడానికి వీల్లేదంటూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తీవ్ర చర్చనీయాంశమైంది. అతడిపై ఇంత శిక్ష విధించడానికి వెనకున్నది ఓ విడాకులు కేసు కావడం అన్నింటికంటే ఆశ్చర్యం కలిగించే విషయం. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాకు చెందిన నోవామ్ హప్పెర్ట్ (44) దంపతులకు ఇద్దరు పిల్లలు.

2011లో హప్పెర్ట్ దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో అతడి భార్య ఇద్దరు పిల్లలను తీసుకుని తన సొంతదేశమైన ఇజ్రాయెల్ వచ్చేసింది. అనంతరం అక్కడి కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. అయితే భార్య, పిల్లల ఎడబాటును భరించలేని హప్పెర్ట్ ఏడాది తర్వాత అంటే 2012లో ఇజ్రాయెల్ వెళ్లాడు.

మరోవైపు, ఆమె పెట్టుకున్న విడాకుల కేసును విచారించిన న్యాయస్థానం తీర్పు చెబుతూ.. పిల్లల బాగోగుల కోసం 3 మిలియన్ డాలర్లు చెల్లించేంత వరకు దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. భరణం చెల్లించేంత వరకు అతడు దేశం విడిచి వెళ్లకుండా చూడాలని కోరే హక్కు అతడి భార్యకు ఉందని స్పష్టం చేస్తూ.. 31 డిసెంబరు 9999 వరకు దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. అంటే 8 వేల ఏళ్లపాటు హప్పెర్ట్ ఇజ్రాయెల్‌లోనే బందీగా గడపాల్సి ఉంటుంది.

2013లోనే కోర్టు ఈ తీర్పు వెల్లడించినా ఇన్నాళ్లూ విషయం వెలుగులోకి రాలేదు. తాజాగా హప్పెర్ట్ తన ఆవేదనను అంతర్జాతీయ మీడియా ముందు వెళ్లబోసుకోవడంతో విషయం బయటకు వచ్చి చర్చనీయాంశమైంది. విడాకుల విషయంలో ఇజ్రాయెల్‌లో అమలవుతున్న దారుణ చట్టాలకు తనలాంటి ఎంతోమంది బలైపోతున్నారని హప్పెర్ట్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

తనలాంటి ఎంతోమంది బాధితులు పడుతున్న అవస్థలను తెలియజేయడంతోపాటు, ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే అంతర్జాతీయ మీడియా దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిపాడు. సాంకేతికత సహా ఇతర అన్ని రంగాల్లోనూ ఎంతోముందు ఉండే ఇజ్రాయెల్‌లో ఇలాంటి తీర్పును ఊహించలేకపోతున్నామని న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

తెలంగాణలో గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీల వివాదంపై హైకోర్టులో విచార‌ణ‌…

Drukpadam

జూన్ 3న మంత్రుల చాంబర్ల స్వాధీనానికి జీఏడీ ఆదేశాలు!

Ram Narayana

నాపై ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే నా సమాధానం: భూమన కరుణాకర్ రెడ్డి

Ram Narayana

Leave a Comment