యాప్ లో ముస్లిం మహిళల వేలం.. విరుచుకుపడిన ప్రతిపక్షాలు!
- గిట్ హబ్ యాప్ లో ‘బుల్లి బాయి’ పేరిట మహిళల ఫొటోలు
- ఆరు నెలల్లో ఇది రెండో ఘటన
- చర్యలేవంటూ ప్రతిపక్షాల మండిపాటు
- ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగాలన్న శశిథరూర్
- నిందితులను ఎందుకు అరెస్ట్ చేయట్లేదంటూ శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మండిపాటు
- నిందితుడి కోసం సీఈఆర్టీ, పోలీసులు గాలిస్తున్నారన్న కేంద్ర మంత్రి
- నిందితుడి ఖాతాను బ్లాక్ చేసినట్టు వెల్లడి
కొన్ని నెలల క్రితం ఓ యాప్ లో వందలాది ముస్లిం మహిళల ఫొటోలను పోస్ట్ చేసి వారిని వేలం వేస్తున్నట్టు పోస్ట్ పెట్టారు. ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటనే కలకలం సృష్టించింది. ఓపెన్ సోర్స్ ప్లాట్ ఫాం అయిన ‘గిట్ హబ్’లో వందలాది ముస్లిం మహిళల ఫొటోలను షేర్ చేస్తూ.. వేలం వేస్తున్నట్టు ప్రకటించారు. యాప్ లో ‘బుల్లి బాయి’ అనే పేరుతో ఓ దుండగుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
దీనిపై హసీబా అమీన్ అనే కాంగ్రెస్ పార్టీ నేషనల్ కన్వీనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫొటోలను యాప్ లో పోస్ట్ చేశారని, నీచమైన కామెంట్లు పెట్టారని అన్నారు. దీనిపై మేలోనే ఎఫ్ ఐఆర్ నమోదు చేసినా ఇప్పటిదాకా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని అన్నారు. మళ్లీ ఇప్పుడు దుండగులు అదే ఘాతుకానికి పాల్పడ్డారని అన్నారు. ఇప్పుడైనా చర్యలు తీసుకుంటారా? అని పోలీసులను ప్రశ్నించారు.
ఆమె ట్వీట్ ను రీట్వీట్ చేసిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. ఇలాంటి వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారంటే అసహ్యమేస్తోందని అన్నారు. అలాంటి వారికి మరో అవకాశం ఇవ్వకుండా వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఢిల్లీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగాలని సూచించారు. ఇటు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా దీనిపై స్పందించారు. ఇలాంటి వారిపై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవాడం లేదని ఆమె ప్రశ్నించారు. సైట్లను, యూజర్లను బ్లాక్ చేసినంత మాత్రాన సరిపోదని అన్నారు. ఇలాంటి నీచమైన డీల్స్ పై ఇప్పటికే కేంద్ర ఐటీ శాఖ మంత్రికి లేఖలు రాశానని గుర్తు చేశారు. గత ఏడాది జూలై 30, సెప్టెంబర్ 6న లేఖలు రాశానని, నవంబర్ 2న తనకు కేంద్ర మంత్రి నుంచి సమాధానం వచ్చిందని చెప్పారు. ఈ ఘటనలు మళ్లీ తెరపైకి వచ్చాయని, అయినా ఇప్పటిదాకా నిందితులను అరెస్ట్ చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, ఘటనకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ చౌబే వెల్లడించారు. బుల్లి బాయి అకౌంట్ ను గిట్ హబ్ బ్లాక్ చేసిందన్నారు. నిందితుడిని పట్టుకునేందుకు సీఈఆర్టీ, పోలీసు అధికారులు వేట సాగిస్తున్నారన్నారు. గత ఏడాది జూలై 4న కూడా సల్లీ డీల్స్ అనే ఓ యాప్ లో ముస్లిం మహిళల ఫొటోలను షేర్ చేసి వేలం వేస్తున్నట్టు ప్రకటించిన ఘటన జరిగింది. కొందరు ట్విట్టర్ యూజర్లు వాటి స్క్రీన్ షాట్లను పోస్ట్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఢిల్లీ, యూపీ పోలీసులు సల్లీ డీల్స్ యాప్ పై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.
ఇలాంటివారిని ఊరికే వదలకూడదు: యాప్ లో ముస్లిం మహిళల వేలంపై ఒవైసీ ఆగ్రహం
ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ ‘గిట్ హబ్’ వేదికగా కార్యకలాపాలు నిర్వహించే ‘బుల్లి బాయి’ అనే యాప్ లో ముస్లిం మహిళల ఫొటోలు పోస్టు చేస్తూ వారిని వేలం వేస్తున్నట్టు ప్రచారం చేస్తుండడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని ఊరికే వదలరాదని మండిపడ్డారు. ఇలాంటి చెదపురుగులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ తెలంగాణ సీఎం కార్యాలయాన్ని, మంత్రి కేటీఆర్ ను, తెలంగాణ డీజీపీని, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ను డిమాండ్ చేశారు.
‘బుల్లి బాయి’ యాప్ లో వేలం వేస్తున్న మహిళల ఫొటోల్లో తనది కూడా అప్ లోడ్ చేశారంటూ ఆయేషా మినాజ్ అనే మహిళా పాత్రికేయురాలు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పట్ల స్పందిస్తూ ఒవైసీ పైవిధంగా వ్యాఖ్యానించారు.