Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

ఒక్కటిగా ఉందాం సినీ పరిశ్రమను బతికించుకుందాం :నటుడు మోహన్ బాబు!

ఒక్కటిగా ఉందాం సినీ పరిశ్రమను బతికించుకుందాం :నటుడు మోహన్ బాబు!
-47 సంవత్సరాల అనుభవంతో చెబుతున్నా… నా మాట వినండి
-కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న చిత్ర పరిశ్రమ
-సినిమా టికెట్ల ధరలు, ఇతర సమస్యలతో సతమతం
-ఓ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్లాలన్న మోహన్ బాబు
-అందరూ సమానమేనని వెల్లడి
-ముఖ్యమంత్రులను గౌరవించాలని హితవు

ఇటీవల కాలంలో కరోనాతో పాటు తెలుగు సినీ పరిశ్రమను అనేక సమస్యలు చుట్టుముట్టాయి. సినిమా టికెట్ల అంశం వాటిలో ప్రధానమైనది. బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చిత్ర పరిశ్రమ ప్రముఖులు ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ సమస్యలు వీడడంలేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు తీవ్రంగా స్పందించారు. “మనకెందుకులే అని మౌనంగా ఉండాలా… నా మౌనం చేతకానితనం కాదు, చేవలేనితనం కాదు” అని స్పష్టం చేశారు.

నీ మాటలు నిక్కచ్చిగా, కఠినంగా ఉంటాయని, ఇతరులను ఇబ్బందిపెట్టడం ఎందుకని కొందరు శ్రేయోభిలాషులు తనను వారించారని వెల్లడించారు. ఇది నీకు అవసరమా అని కూడా అన్నారు… అంటే వాళ్లు చెప్పినట్టు నేను బతకాలా, లేక నాకు నచ్చినట్టు నేను బతకాలా అనే ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు సమాధానమే ఇది అంటూ మోహన్ బాబు ఓ ప్రకటన చేశారు.

“47 సంవత్సరాల అనుభవంతో చెబుతున్న మాట ఇది. అందరి జీవితాలతో ముడిపడి ఉన్న ఈ సినిమా పరిశ్రమ గురించి, మనకు ఉన్న సమస్యల గురించి సీఎంలకు వివరించాలనుకుంటే అంతకుముందు చేయాల్సిన పని ఒకటుంది. అందరం కలిసి ఒకచోట కూర్చుని, మన సమస్యలు ఏంటి? పరిష్కారాలు ఏంటి? సినీ పరిశ్రమకు ఏది మేలు చేస్తుంది? అనేది చర్చించుకోవాలి. ఆ తర్వాత రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులను, రెండు రాష్ట్రాల సీఎంలను కలసికట్టుగా కలవాలి.

అలా కాకుండా, నలుగుర్నే రమ్మన్నారు… నిర్మాతల నుంచి నలుగురు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి నలుగురు, హీరోల నుంచి ఇద్దర్ని రమ్మన్నారు… ఏంటిది? మళ్లీ మళ్లీ చెబుతున్నా… సినిమా ఇండస్ట్రీలో అందరూ సమానమే. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదు. ఏ ఒక్కరి పెత్తనం కాదు. చిన్న నిర్మాతలను కూడా కలుపుకుని సీఎంల వద్దకు వెళ్లి సమస్యల్ని వివరించి ఉంటే మనకు ఈ రోజు ఇన్ని కష్టాలు వచ్చేవి కావు” అని మోహన్ బాబు స్పష్టం చేశారు.

సినీ పరిశ్రమలో అనేక పార్టీలకు చెందినవాళ్లు ఉండొచ్చని, కానీ ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రులను ముందుగా కలవాల్సిన అవసరం ఉందని మోహన్ బాబు నొక్కిచెప్పారు. “సీఎంలను మనం గౌరవించుకోవాలి, మన సమస్యలు వాళ్లతో చెప్పుకోవాలి… కానీ అలా జరిగిందా అంటే జరగలేదు!” అని విమర్శించారు.

అయితే తాను ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసి పైరసీ కోరల్లో సినిమా పరిశ్రమ నలిగిపోతోందని చెప్పగానే, ఆయన చర్యలు తీసుకున్నారని వివరించారు. తాను అప్పట్లో రాజశేఖర్ రెడ్డిని కలిసి “ఇండస్ట్రీని కాపాడండి, మాకు ఈ భిక్ష పెట్టండి” అని కోరడం చాలామందికి నచ్చలేదని, కానీ తమ విజ్ఞప్తి రాజశేఖర్ రెడ్డిని కదిలించిందని, ఆయన తీసుకున్న చర్యలతో పైరసీ చాలావరకు కట్టడి అయిందని మోహన్ బాబు తెలిపారు.

ఇప్పుడు రూ.350, రూ.300 టికెట్లతో చిన్న సినిమాలు నిలబడడం కష్టం అని… అదే సమయంలో రూ.50, రూ.30 టికెట్లతో పెద్ద సినిమాలు నిలదొక్కుకోవడం కష్టమని అభిప్రాయపడ్డారు. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా అన్ని సినిమాలు ఆడాలి అని అభిలషించారు. అయితే అందుకు సరైన టికెట్ ధరలు ఉండాలని మోహన్ బాబు స్పష్టం చేశారు. “ఈ క్రమంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి అయ్యా… మా సినీ రంగం పరిస్థితి ఇది… చిన్న సినిమాలను, పెద్ద సినిమాలను దృష్టిలో ఉంచుకుని మనకు న్యాయం చేయమని అడుగుదాం” అని హితవు పలికారు.

చిత్ర పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ ఉన్నాయని, తామందరికీ నిర్మాతలే దేవుళ్లని, కానీ ఇవాళ్టి రోజున ఆ నిర్మాతలు ఏమయ్యారని ఆయన ప్రశ్నించారు. అసలు, నిర్మాతల మండలి ఈ సమస్యలను భుజాల మీద వేసుకోకుండా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా ఎందుకు మౌనం వహిస్తుందో అర్థంకావడంలేదని పేర్కొన్నారు. మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది అంటూ నిర్మాతలకు సూచించారు. “ఒక్కటిగా ఉంటేనే సినిమా బ్రతుకుతుంది… రండి అందరం కలిసి సినిమాను బతికిద్దాం” అంటూ పిలుపునిచ్చారు.

Related posts

నా బిడ్డ ఇక్కడే ఉంటాడు, ఈ ఊళ్లోనే ఉంటాడు… మంచు విష్ణుకు, అతని ప్యానెల్ కు ఓటేయండి: మోహన్ బాబు!

Drukpadam

విశాల్ లంచం ఆరోపణలపై స్పందించిన కేంద్రం, సీరియస్‌‌గా తీసుకున్న సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ

Ram Narayana

ముందు పూల వర్షం కురిపించారు…తర్వాత కోడిగుడ్లు విసిరారు: చిరంజీవి..!

Drukpadam

Leave a Comment