Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం.. కార్యాలయ తలుపులు పగులగొట్టి అరెస్ట్!

  • బండి సంజయ్ అరెస్ట్ …14 రోజులు జుడీసిల్ రిమాండ్
    కరీంనగర్ జైలుకు తరలింపు :సంజయ్ తో పాటు మరో 37 మంది
    టీఆర్ యస్ ప్రభుత్వ చర్యలపై బీజేపీ అధిష్టానం సీరియస్
    పాత కేసులు తిరగతోడే ఆలోచనలో పోలీసులు
    తలుపులు బద్దలు కొట్టి లోనకు చొరబడిన పోలీసులు
    అరెస్ట్ చేయడానికి ముందు లైట్లు ఆఫ్ చేసిన పోలీసులు
    ఆపై పైరింజన్లతో కిటికీ గుండా నేతలపై నీళ్లు
    అరెస్ట్ చేసి మానకొండూరు పోలీస్ స్టేషన్‌కు తరలింపు
    కేసీఆర్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన బండి
    తీవ్రంగా ఖండించిన బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా , కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

 

ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణదీక్షను పోలీసులు భగ్నం చేశారు. అంతకు ముందు బండి సంజయ్ కార్యాలయంలో ఉన్న వారిని నిర్బందించేందుకు పోలీసులు తలుపులు బద్దలు కొట్టి ,ఫైర్ ఇంజన్లతో నీళ్లను లోపలి కొట్టారు . దీనిపై బీజేపీ అధిష్టానం మండిపడింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా దీన్ని తీవ్రంగా ఖండించారు . గత రాత్రి ఏడున్నర గంటల నుంచే దీక్ష కోసం ఏర్పాట్లు చేయగా, మధ్యాహ్నం నుంచే బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో దీక్షా స్థలికి చేరుకున్నారు.

అయితే, ఈ దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయం, బొడిగె శోభ తదితరులు ఉన్నారు. నేతల అరెస్టులతో అక్కడ ఉద్రిక్త  పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ క్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి బండి సంజయ్ బైక్‌పై కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయన వారి నుంచి తప్పించుకుని లోపలికి వెళ్లి దీక్ష చేపట్టారు. రాత్రి 8 గంటల సమయంలో దీక్ష ప్రారంభం కాగా, కార్యాలయ ప్రధాన ద్వారాన్ని పార్టీ నేతలు మూసివేశారు.

మరోవైపు, దీక్షను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో లైట్లు ఆఫ్ చేసి, కిటికీల గుండా లోపల దీక్ష చేస్తున్న వారిపై ఫైర్ ఇంజిన్లతో నీళ్లు చల్లారు. ఆ తర్వాత తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లి బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. బండి సంజయ్ తలకు గాయమైంది. అరెస్ట్ చేసిన సంజయ్‌ను మానకొండూరు పోలీస్ స్టేషన్‌కు తరలించగా, అక్కడ కూడా ఆయన దీక్ష కొనసాగించినట్టు తెలుస్తోంది.

మరోపక్క, తన దీక్షను భగ్నం చేయడంపై బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం, అహంకారంతో కేసీఆర్ కళ్లు నెత్తికెక్కినట్టు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపైనా మండిపడిన ఆయన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో ఎంతోమంది గాయపడ్డారని, వారికేమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

అంతేకాదు, ‘‘నువ్వు జైలుకెళ్లే సమయంలో నీ కుటుంబ సభ్యులు కూడా పోలీసుల తీరుతో ఇలాగే ఇబ్బంది పడతారు’’ అని కేసీఆర్‌ను ఉద్దేశించి హెచ్చరించారు. తన కార్యాలయంలోకి వచ్చి దౌర్జన్యం చేసిన పోలీసులకు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇస్తానని హెచ్చరించారు.

ఇదిలావుంచితే, బండి సంజయ్ అరెస్ట్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందిస్తూ.. కేసీఆర్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. బండి సంజయ్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. తలుపులు బద్దలుగొట్టి మరీ ఆయనను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని అన్నారు. అలాగే, ఎంపీ అర్వింద్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు కూడా సంజయ్ అరెస్ట్‌ను ఖండించారు.

Related posts

ఏపీ సీఎం జగన్ జార్ఖండ్ సీఎం సొరేన్ కు సుద్దులు చెప్పటంపై అభ్యతరం

Drukpadam

తాము అధికారంలోకి వస్తే …ఆయిల్ ధరలు తగ్గిస్తాం స్టాలిన్

Drukpadam

వైసీపీ నేతల దూషణలను ఆహ్వానిస్తున్నా: పవన్ కల్యాణ్

Drukpadam

Leave a Comment