Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రధానికి భద్రతా వైఫల్యంపై రాష్ట్రపతి ఆందోళన…

న్యూఢిల్లీ: పంజాబ్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్‌లో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యంపై భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం రాష్ట్రపతిభవన్‌లో రామ్ నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పంజాబ్‌లో బుధవారం పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న భద్రతా వైఫల్యానికి సంబంధించిన వివరాలను ప్రధాని మోడీని అడిగి తెలుసుకున్నారు రాష్ట్రపతి.

ఈ క్రమంలో ప్రధానికి పంజాబ్ రాష్ట్రంలో భద్రతా వైఫల్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు రామ్ నాథ్ కోవింద్. మరోవైపు, ప్రధానమంత్రి పర్యటనలో బయటపడిన భారీ భద్రతా వైఫల్యంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కాగా, బుధవారం ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఫిరోజ్‌పూర్ జిల్లాలో నిరసనకారులు రహదారిని దిగ్బంధించడంతో ప్రధాని, ఆయన కాన్వాయ్ సుమారు 20 నిమిషాలపాటు ఫ్లైఓవర్‌పైనే చిక్కుకుపోయింది. దీంతో తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్న ప్రధాని ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ తీవ్రంగా స్పందించింది. ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మోడీకి భౌతికంగా హాని కలిగించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. వరుస ఓటములతో ఆ పార్టీ ఉన్మాదానికి దిగుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం భద్రతా వైఫల్యం ఏమీలేదని చెబుతోంది. కాంగ్రెస్ నేతలు కూడా పంజాబ్ సర్కారు మద్దతు పలుకుతున్నారు. ఫిరోజ్‌పూర్‌లో భద్రతా వైఫల్యానికి బాధ్యున్ని చేస్తూ అక్కడి సీనియర్ ఎస్పీని సస్పెండ్ చేసింది పంజాబ్ ప్రభుత్వం.

సుప్రీంకోర్టులు రేపు విచారణ

ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో చోటు చేసుకున్న భారీ భద్రతా వైఫల్యం వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కోరారు. ప్రధాని మోడీ కాన్వాయ్ కు భద్రతా వైపల్యంపై అత్యున్నత స్థాయి విచారణ చేపట్టాలని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు.

పంజాబ్ పాలకులు దురుద్దేశంతోనే భద్రతా వైఫల్యం సృష్టించారని, దేశ భద్రతకే ఇది తీవ్రమైన విఘాతమని పిటిషనర్ వాదించారు. ప్రోటోకాల్ ప్రకారం.. ప్రధాని కాన్వాయ్ లో చీఫ్ సెక్రటరీ, డీజీపీ కూడా ఉండాలన్నారు. కానీ, ప్రధాని కాన్వాయ్‌లో వారిద్దరూ లేరిని వెల్లడించింది. భద్రతా ఏర్పాట్లపై ఆధారాలను భఠిండా జిల్లా జడ్జి వద్ద ఉంచేలా ఆదేశాలివ్వాలని కోర్టును అభ్యర్థించారు.

దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఉదయం విచారించనుంది. పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని కేంద్రానికి, పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. 
మరోవైపు, భద్రతా వైఫల్యంపై దర్యాప్తు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి మెహ్‌తాబ్ గిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాగ్ వర్మలతో కూడిన ఈ కమిటీ ఘటనపై విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

కాగా, పంజాబ్ లో ప్రధానికి భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఆందోళనలపై నిఘా వర్గాల నుంచి సమాచారం ఉన్నప్పటికీ.. పంజాబ్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ బ్లూ బుక్ ను ఆ రాష్ట్ర పోలీసులు పాటించలేదని కేంద్ర హోంశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రధానమంత్రి భద్రత ఏర్పాట్లకు పాటించాల్సిన మార్గదర్శకాలన్నీ బ్లూ బుక్ లో ఉంటాయి. దీని ప్రకారం.. ప్రధాని పర్యటనలో బుధవారం నాటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే రాష్ట్రాలు ఆకస్మిక మార్గాన్ని సిద్ధం చేయాలి. అనూహ్య ఘటనలు జరిగినప్పుడు రాష్ట్ర పోలీసులు.. స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్‌కు అప్‌డేట్ చేసి అందుకు అనుగుణంగా వీఐపీల ప్రయాణాలను మార్చాలి. కానీ, పంజాబ్ పోలీసులు అలా చేయలేదు. అంతేగాక, నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు పంజాబ్ పోలీసులతో కాంటాక్ట్ లోనే ఉంటూ.. ఆందోళనకారుల గురించి అప్రమత్తం చేశాయి. అయినా, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కేంద్ర హోంశాఖ సీనియర్ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts

టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు!

Drukpadam

కాంగ్రెస్ తోనే మైనార్టీల సంక్షేమం…

Ram Narayana

హన్మకొండలో సీఎం కేసీఆర్ కు వీఆర్ ఏ ల నిరసన సెగ …

Drukpadam

Leave a Comment