- ఫిబ్రవరి 28న లయన్స్ రోర్‌లో భాగంగా ఇజ్రాయెల్ దాడి
- దాడిలో ఖమేనీ, కీలక నాయకులు, జనరల్స్ మృతి
- దాడి సమయంలో మోజ్తబా ప్రాణాలతో బయటపడినట్లు వార్తలు
- అయితే దాడి సమయంలో కాంపౌండ్‌లో ఉన్నారా వెల్లడి కావాల్సి ఉందని కథనాలు
ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ ఇజ్రాయెల్ దాడిలో గాయపడ్డారు. ఖమేనీ వారసుడిగా మోజ్తబా పేరు వినిపిస్తోంది. అయితే ఫిబ్రవరి 28న లయన్స్ రోర్‌లో భాగంగా ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో అలీ ఖమేనీతో పాటు 40 మంది కీలక నాయకులు, జనరల్స్ ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మొజ్తబా భార్య జహ్రా కూడా మరణించారు. ఈ దాడి నుంచి మోజ్తబా మాత్రం ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ దాడి చేసిన సమయంలో మోజ్తబా తన తండ్రితో పాటు కాంపౌండ్‌లోనే ఉన్నారా అన్న విషయం వెల్లడి కావాల్సి ఉంది. ఆయనకు గాయాల తీవ్రత కూడా తెలియరాలేదు. ఈ దాడి నుంచి మోజ్తబా ప్రాణాలతో బయటపడ్డారని, కానీ గాయపడ్డారని ఇజ్రాయెల్ భద్రతా అధికారులు కూడా భావిస్తున్నారు.
అలీ ఖమేనీ తర్వాత ఇరాన్ తదుపరి నేతగా మోజ్తబా ముందు వరుసలో ఉన్నారు. ఇతనికి ఇరాన్‌లోని శక్తిమంతమైన ఐఆర్జీసీపై పట్టు ఉంది. దీనితో ఆయనే ఖమేనీ స్థానాన్ని భర్తీ చేస్తారని అందరూ భావిస్తున్నారు. అయితే 88 మంది సభ్యులున్న గార్డియన్ కౌన్సిల్‌లో కొందరు మాత్రం అధికారాన్ని వారసత్వంగా మోజ్తబాకు అందించడాన్ని వ్యతిరేకిస్తున్నారని సమాచారం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మోజ్తాబాకు అధికారం అప్పగించేందుకు ససేమీరా అంటున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: