- డీలిమిటేషన్‌పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఊరుకోబోమన్న స్టాలిన్
- పునర్విభజన ప్రక్రియ అశాస్త్రీయంగా ఉందని విమర్శ
- దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామని వ్యాఖ్య
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కేంద్ర ప్రభుత్వానికి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక వీడియోను విడుదల చేస్తూ, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు.
డీలిమిటేషన్‌పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే తమిళనాడు చూస్తూ ఊరుకోదని, ఇది బెదిరింపు కాదని, కేంద్రానికి తన ‘ఫైనల్ వార్నింగ్’ అని స్టాలిన్ హెచ్చరించారు. అవసరమైతే రాష్ట్రంలోని ప్రతి కుటుంబం వీధుల్లోకి వచ్చి పోరాడుతుందని, ఈ పోరాటంలో ప్రజలే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
కేంద్రం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అశాస్త్రీయంగా ఉందని, దీనిని తాము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే చెన్నైలో ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలతో సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదని ప్రధాని మోదీ పార్లమెంటులో హామీ ఇవ్వాలని తాము డిమాండ్ చేసినా, ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. ఈ విషయంపై చర్చించేందుకు అపాయింట్‌మెంట్ కోరినా కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు.
స్టాలిన్ ‘ఫైనల్ వార్నింగ్’ కు కౌంటర్ ఇచ్చిన అన్నామలై

- నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం స్టాలిన్ వ్యాఖ్యలను ఖండించిన అన్నామలై
- ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని స్టాలిన్‌పై ఆరోపణ
- దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని కేంద్రం తరఫున హామీ
- జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు నష్టం జరగనివ్వబోమన్న సీఎం స్టాలిన్
- పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో తమిళనాడులో రాజుకున్న రాజకీయ వేడి
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రాన్ని ఉద్దేశిస్తూ చేసిన ‘ఫైనల్ వార్నింగ్’ ప్రకటనపై తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించేందుకే స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, కేంద్రంపై ఆయన చేసిన హెచ్చరికలు ఏమాత్రం సరికాదని మంగళవారం ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ ప్రభుత్వం అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తుందని, స్టాలిన్ ఆందోళనలు నిరాధారమైనవని కొట్టిపారేశారు.
ఏప్రిల్ 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రాజకీయ వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమావేశాల్లో మహిళలకు పార్లమెంటులో మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించే “నారీ శక్తి వందన్ అధినియమ్” సవరణలతో పాటు, ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లుపై చర్చ జరగనుంది. ఈ క్రమంలోనే సీఎం స్టాలిన్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన తమిళనాడు వంటి రాష్ట్రాలు ఇప్పుడు నష్టపోయే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు. ఒకవేళ తమ ప్రయోజనాలకు భంగం వాటిల్లితే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
స్టాలిన్ వ్యాఖ్యలపై అన్నామలై తీవ్రంగా స్పందించారు. “ముఖ్యమంత్రి ప్రజల మనసుల్లో విభేదాలు సృష్టించి, భయాన్ని నూరిపోయాలని చూడటం చాలా దురదృష్టకరం. తమిళనాడు మళ్లీ 1960ల నాటి పరిస్థితులకు వెళుతుందని, ప్రధానిని బెదిరించేలా ఆయన ఉపయోగించిన భాష ఆమోదయోగ్యం కాదు” అని అన్నామలై అన్నారు. ప్రధాని మోదీ అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ఎంతో కృషి చేశారని తెలిపారు.
డీలిమిటేషన్ పెంపు పూర్తిగా జనాభా ఆధారంగా ఉంటుందని కేంద్రం ఎక్కడా చెప్పలేదని అన్నామలై స్పష్టం చేశారు. “తమిళనాడు ముఖ్యమంత్రి సమస్య ఏంటి? మేం ఎక్కడా జనాభా ఆధారంగానే పెంపు ఉంటుందని చెప్పలేదు. అందరినీ కలుపుకొనిపోతామని చెప్పాం. ఏడాది క్రితం కోయంబత్తూరులో కేంద్ర హోంమంత్రి మాట్లాడుతూ.. పెంపు ప్రో-రాటా (అనుపాత) పద్ధతిలో ఉంటుందని, తద్వారా ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని హామీ ఇచ్చారు. అయినప్పటికీ, సీఎం స్టాలిన్ ఇలాంటి వీడియో విడుదల చేయడం ఆయన రాజ్యాంగంపై చేసిన ప్రమాణానికి విరుద్ధం” అని అన్నామలై విమర్శించారు.
ఏమిటీ ‘ప్రో-రాటా’ విధానం? కేంద్రం ఏం చెబుతోందంటే…!
సాధారణంగా నియోజకవర్గాల పునర్విభజన తాజా జనాభా లెక్కల ఆధారంగా జరగాలి. కానీ, ‘ప్రో-రాటా’ విధానంలో అలా కాకుండా, ప్రస్తుతం ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఉన్నాయో అదే నిష్పత్తిలో కొత్త సీట్లను పెంచుతారు. ఉదాహరణకు, అన్ని రాష్ట్రాలకు ఏకరీతిగా 50 శాతం సీట్లు పెంచితే, 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్‌కు 120, 39 సీట్లున్న తమిళనాడుకు దాదాపు 59 సీట్లు వస్తాయి. జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసి నష్టపోతామని భావిస్తున్న దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను తగ్గించేందుకే కేంద్రం ఈ ఫార్ములాను పరిశీలిస్తున్నట్లు చెబుతోంది.