జాతీయ వార్తలు

ద్వంద్వ పౌరసత్వం… రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు…

  • కేసు నమోదు చేసి విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు
  • యూపీ ప్రభుత్వమే స్వయంగా ఈ కేసు దర్యాప్తు చేయాలని సూచన
  • లేదంటే కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలన్న అలహాబాద్ హైకోర్టు

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ద్వంద్వ పౌరసత్వం ఉందన్న ఆరోపణలపై కేసు నమోదు చేసి, విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఉత్తర్వులిచ్చింది. ఈ కేసు దర్యాప్తును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని సూచించింది. లేదంటే ఒక కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని పేర్కొంది.

రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న తన అభ్యర్థనను లక్నోలోని ప్రత్యేక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ఈ సంవత్సరం జనవరి 28న తిరస్కరించడంతో, బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిశిర్ అప్పీలు చేశారు. దీంతో అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఈ ఉత్తర్వులు ఇచ్చింది.

రాహుల్ గాంధీ పౌరసత్వం అంశంపై కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది. రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని, భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి, కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిశిర్ డిమాండ్ చేస్తున్నారు. బ్రిటన్‌లో నమోదైన ఓ కంపెనీకి రాహుల్ గాంధీ డైరెక్టర్‌గా, సెక్రటరీగా ఉన్నారని సుబ్రహ్మణ్యస్వామి చెబుతున్నారు.

ఆ కంపెనీ వార్షిక నివేదికలోనూ తనను తాను బ్రిటిష్ పౌరుడిగా రాహుల్ గాంధీ పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. వేరే దేశంలో పౌరుడిగా ఉన్న వ్యక్తి ఆ దేశ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాల్సి ఉంటుందని అన్నారు. లేదంటే చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. ఈ అంశంపై సుబ్రహ్మణ్యస్వామి గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.

Related posts

టికెట్ల ధరలపై పరిమితి ఎత్తివేసిన కేంద్రం.. విమాన ప్రయాణం ప్రియం కానుందా?

Ram Narayana

నిజాం నగల తరలింపుపై కేంద్రం కీలక ప్రకటన…

Ram Narayana

బరంపురంలో పట్టపగలే కాల్పులు.. బీజేపీ నేత పీతాబాస్ పాండా దారుణ హత్య!

Ram Narayana