- పెద్దపప్పూరు మండలం జూటూరులో 60 ఎకరాల తోటలో చింత మొక్కలు పెంచుతున్న జేసీ
- ఆదివారం రాత్రి నిప్పు పెట్టిన దుండగులు
- 30 ఎకరాల్లో చింత చెట్లు, బిందు సేద్యం పరికరాలు పూర్తిగా కాలిపోయిన వైనం
అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన చింత తోటకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
జూటూరు గ్రామంలోని 60 ఎకరాల విస్తీర్ణంలోని తోటలో చింత మొక్కలను నాటి పెంచుతున్నారు. ఆదివారం రాత్రి దుండగులు నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో, తోటలోని 30 ఎకరాల్లోని చింత చెట్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతోపాటు, బిందు సేద్యం కోసం ఏర్పాటు చేసిన పైపులు, పరికరాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. నష్టం రూ. 5 లక్షల వరకు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
తోట కాపలా సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై జేసీ అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుండగులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు.