- మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తున్నట్లు వెల్లడి
- నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మహిళా బిల్లుతో కలపవద్దని విజ్ఞప్తి
- దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని సూచన
లోక్ సభ నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లోక్ సభ నియోజకవర్గాల పెంపుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో నియోజకవర్గాల పునర్విభజనను ముడిపెట్టవద్దని కోరారు.
ఈ లేఖలో ఆయన మూడు అంశాలను ప్రస్తావించారు. మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు, చిన్నరాష్ట్రాలకు అన్యాయం జరిగేలా నియోజకవర్గాల పెంపు ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరగా మహిళా బిల్లుకు, పునర్విభజన బిల్లుకు లంకె పెట్టవద్దని కోరారు.
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. నియోజకవర్గాల పెంపు వంటి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఇందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన చేపడితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని అన్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గకుండా చూడాలని ప్రధానిని కోరారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: