పొత్తులపై సీపీఐ రామకృష్ణ స్పందన.. జనసేనకు సలహా!
- అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు ఉంటాయి
- బీజేపీ పొత్తు నుంచి జనసేన బయటకు రావాలి
- ఏపీ రాజధాని అమరావతే అని ప్రకటించాలి
పొత్తుల గురించి టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడినప్పటి నుంచి ఏపీలో ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. జనసేన పార్టీని ఉద్దేశించి చంద్రబాబు పొత్తుల గురించి మాట్లాడారు. చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ, వైసీపీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
పొత్తులు లేకుండా చంద్రబాబు ఒక్కసారి కూడా గెలవలేదని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు పొత్తుల అంశంపై సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని చెప్పారు. తమ పార్టీ జాతీయ నేతల నిర్ణయం మేరకు పొత్తులు, సర్దుబాట్లు ఉంటాయని అన్నారు.
బీజేపీతో పొత్తు నుంచి జనసేన బయటకు రావాలని ఈ సందర్భంగా రామకృష్ణ కోరారు. దేశాన్ని కాపాడాల్సిన ప్రధాని మోదీనే తాను ప్రాణాలతో బయటపడ్డానని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. మోదీది ఓట్ల రాజకీయమని చెప్పారు. పీఆర్సీ విషయంలో ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని రామకృష్ణ అన్నారు.
ప్రభుత్వ నిర్ణయం బాగుందని కొందరు ఉద్యోగ సంఘ నేతలు కంటితుడుపు మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచడం సరికాదని అన్నారు. జగన్ సీఎంగా ఉన్నంత కాలం యువతకు ఉద్యోగాలు రావని వ్యాఖ్యానించారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.