సాగర్ కుడికాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఏపీ ప్రభుత్వ విప్ పిన్నెల్లి బంధువుల మృతి!
- షాపింగ్ కోసం భార్య, కుమార్తెతో కలిసి విజయవాడ వెళ్లిన మదన్‌మోహనరెడ్డి
- తిరిగి వస్తుండగా అడిగొప్పుల వద్ద ప్రమాదం
- ఈదుకుంటూ బయటపడిన మదన్‌మోహన్‌రెడ్డి
- కారులో చిక్కుకుపోయి మృతి చెందిన భార్య, కుమార్తె
సాగర్ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఏపీ ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయి సుందరరామిరెడ్డి కుమారుడు మదన్ మోహనరెడ్డి ప్రాణాలతో బయపటడగా, ఆయన భార్య లావణ్య, కుమార్తె సుదీక్ష మృతి చెందారు. గుంటూరు జిల్లా దుర్గి మండలం గొప్పుల సమీపంలో గత రాత్రి ఈ ఘటన జరిగింది. సంక్రాంతి పండుగ కోసం దుస్తులు కొనేందుకు మదనమోహన్‌రెడ్డి భార్య, కుమార్తెతో కలిసి కారులో నిన్న ఉదయం విజయవాడ వెళ్లారు.
షాపింగ్ పూర్తి చేసుకుని వస్తుండగా అడిగొప్పుల సమీపంలో ఓ బైక్‌ను తప్పించే ప్రయత్నంలో కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. మదనమోహన్‌రెడ్డి ఎలాగోలా బయటపడి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండడంతో కారు కొట్టుకుపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు బుగ్గవాగు రిజర్వాయర్ వద్ద నీటిని కిందకు వెళ్లకుండా నిలిపివేసి గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. కారులోనే చిక్కుకుపోయిన మదన్‌మోహనరెడ్డి భార్య, కుమార్తె మరణించారు. ఈ ఘటనతో పిన్నెల్లి కుటుంబంలో విషాదం అలముకుంది.