ఏపీ సర్కారు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రశంసించిన కేంద్రం
- సీఎంలతో మోదీ వర్చువల్ సమావేశం
- కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై సమీక్ష
- రాష్ట్రాలకు సూచనలు
- కరోనా నివారణలో వ్యాక్సినే ప్రధాన ఆయుధం అని వెల్లడి
కరోనా కల్లోలం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటున్న చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో వర్చువల్ భేటీ నిర్వహించారు. ఈ సమీక్షకు ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో లింక్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఏపీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలో 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వారికి అత్యధికంగా వ్యాక్సిన్లు వేసిన రాష్ట్రాల్లో ఏపీ మొదటిస్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రశంసించింది.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది టీనేజర్లకు వ్యాక్సిన్లు ఇచ్చినట్టు వెల్లడించారు. పండుగ సందర్భంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని, కరోనా నియంత్రణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో వ్యాక్సినే ప్రధాన ఆయుధం అని మోదీ వివరించారు.