విరాట్ కోహ్లీ సంచనల నిర్ణయం.. టెస్ట్ కెప్టెన్సీకి గుడ్‌బై!
-కోహ్లీ రాజీనామా ఆమోదించిన బీసీసీఐ
-ధోనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
-కెప్టెన్ గా సహకరించిన సహచరులకు , కోచ్ రవిశాస్త్రికి ధన్యవాదాలు
-జట్టు విజయంకోసం 120 శాతం శ్రమించా
-బీసీసీఐ కి ధన్యవాదాలు
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని అతనే శనివారం ట్విటర్ వేదికగా వెల్లడించాడు. సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్‌గా సేవలందించే అవకాశం ఇచ్చిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)తో పాటు తనను కెప్టెన్‌గా తీర్చిదిద్దిన మహేంద్ర సింగ్ ధోనీకి విరాట్ కోహ్లీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. జట్టు విజయం కోసం తాను 120 శాతం ప్రయత్నించానని చెప్పుకొచ్చాడు. కెప్టెన్‌గా తనకు సహకరించిన ఆటగాళ్లు, కోచ్ రవిశాస్త్రికి థ్యాంక్స్ చెప్పాడు.
‘గత ఏడేళ్లుగా జట్టును సరైన దిశలో నడిపించేందుకు ప్రతీ రోజు శ్రమించాను. నిజాయితీగా నా బాధ్యతలను నిర్వర్తించాను. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకొని వదిలిసేంది లేదు. ఇక ప్రతీ దానికి ఏదో దశలో ముగింపు పలికాలి. టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి నేను తప్పుకుంటున్నాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులున్నాయి. కానీ ఏనాడు ప్రయత్నించకుండా ఉండలేదు. నేను చేసే ప్రతి పనిలో 120 శాతం ఇవ్వాలని ఎప్పుడూ నమ్ముతాను. అలా చేయకపోతే నా మనసు ఏ మాత్రం అంగీకరించదు.
అలా చేయకపోవడం సరైంది కాదు కూడా. నా నిర్ణయంపై నాకు క్లారిటీ ఉంది. నా జట్టుకు నేనెప్పుడూ అన్యాయం చేయను. సుదీర్ఘ కాలం పాటు జట్టును నడిపించే అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు. నా లక్ష్యంలో నాతో నడిచిన నా సహచరులకు కృతజ్ఞతలు. వారే కెప్టెన్‌గా నా ప్రయాణాన్ని మరింత అందంగా మార్చారు. చివరగా నన్ను ఆటగాడిగా, కెప్టెన్‌గా తీర్చిదిద్దిన మహేంద్ర సింగ్ ధోనీకి ప్రత్యేక ధన్యావాదాలు’అని కోహ్లీ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ రాజీనామాను ఆమోదిస్తూ బీసీసీఐ అతనికి ధన్యవాదాలు తెలిపింది. టెస్ట్‌ల్లో కెప్టెన్ విరాట్ టీమ్‌ను ఉన్నత స్థాయిలో నిలబెట్టాడని, 68 మ్యాచ్‌ల్లో 40 విజయాలు అందించి మోస్ట్ సక్సెఫుల్ కెప్టెన్‌గా నిలిచాడని కొనియాడింది.
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ పరాజయం అనంతరం విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని ప్రకటించడం అనేక సందేహాలకు దారి తీస్తుంది. ఇప్పటి వన్డే కెప్టెన్సీ మార్పు విషయంలో బీసీసీఐ పెద్దలతో గొడవపడ్డ కోహ్లీ.. ఇప్పుడు ఆకస్మాత్తుగా టెస్ట్ కెప్టెన్సీ తప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక మూడో టెస్ట్‌లో మైదానంలో విరాట్ ప్రవర్తించిన తీరుపై కూడా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో బీసీసీఐ అతన్ని తప్పించిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి సౌతాఫ్రికా పర్యటనకు ముందే విజయం సాధించకపోతే విరాట్ కోహ్లీని టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పిస్తారని ప్రచారం జరిగింది. అన్నట్లుగానే కోహ్లీ తప్పుకున్నాడు. ఇక బ్యాట్స్‌మెన్‌గా విఫలమైతే జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.