టికెట్ దక్కలేదని.. ఆత్మహత్యకు యత్నించిన సమాజ్‌వాదీ పార్టీ నేత
-పార్టీ కార్యాలయం వద్దనే ఘటన
-యూపీలో వచ్చే నెలలో తొలి విడత ఎన్నికలు
-టికెట్ కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నానన్నఎస్‌పీ నేత
-పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానన్న ఆదిత్య ఠాకూర్
-ఆత్మహత్యే శరణ్యమంటూ కన్నీళ్లు
యూపీ లో ఎన్నికల వేళ టికెట్స్ దక్కని ఆశావహులు ఆత్మహత్యలకు సిద్దపడుతున్నారు. మొన్న బీఎస్పీ టికెట్స్ ఆశించిన నేత బోరున విలపించగా నేడు ఎస్పీ టికెట్స్ దక్కలేదని ఆదిత్య ఠాకూర్ అనే ఎస్పీ నేత పార్టీ కార్యాలయం ముందే ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు . అక్కడే ఉన్న పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు . పెట్రోల్ కళ్ళల్లో పడటంతో ఆయన్ను హుటాహుటిన చికిత్స నిమిత్తం హాస్పటల్ కుతరలించారు .ఆయన గత ఐదు సంవత్సరాలుగా అలీఘడ్ అసెంబ్లీ టికెట్స్ ఆశించి భంగపడ్డారు .తనకే టికెట్స్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్న ఠాకూర్ రాకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు .
ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. వచ్చే నెలలో తొలి విడత ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే పలు పార్టీలు మొదటి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. ఆయా పార్టీల్లోని ఆశావహులు టికెట్ల కోసం విశ్వప్రయత్నాలు చేస్తుండగా, మరికొందరు తమకే టికెట్ దక్కుతుందని ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అలీగఢ్ టికెట్ దక్కుతుందని ఆశించి భంగపడిన సమాజ్‌వాదీ పార్టీ నేత ఆదిత్య ఠాకూర్ ఏకంగా ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. పెట్రోలు కళ్లలోకి వెళ్లి ఇబ్బంది పడుతుండడంతో ఆసుపత్రికి తరలించారు.
ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ.. టికెట్ కోసం ఐదు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నానని, తీరా సమయానికి అది దక్కకపోవడంతో బాధగా ఉందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఐదు సంవత్సరాలు తాను ప్రజల మధ్యే గడిపానని గుర్తు చేశారు. పార్టీ కోసం ఇంతగా కష్టపడిన తనను కాదని, వేరే వ్యక్తికి టికెట్ ఇచ్చారంటూ విలపించారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదన్నారు. కాగా, అలీగఢ్ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే జాఫర్ ఆలంకు పార్టీ కేటాయించింది.