గోవాలో ‘కుల’ ఆయుధాన్ని ఎక్కుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ.. సీఎం అభ్యర్థిగా పాలేకర్!
-భండారీ సామాజిక వర్గం నుంచి ఎంపిక
-గోవా జనాభాలో వీరి ప్రాతినిధ్యం 35 శాతం
-కుల రాజకీయాలు చేయడం లేదన్న కేజ్రీవాల్
-అధికారమిస్తే అవినీతిని తుడిచేస్తామని ప్రకటన
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అయిన అరవింద్ కేజ్రీవాల్ స్వతహాగా మంచి వ్యూహకర్త, తెలివైనవారు. ఢిల్లీతో మొదలు పెట్టి.. ఆప్ ను దేశవ్యాప్తం చేసే దీక్షలో ఆయన సాగిపోతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పంజాబ్ లో ప్రజాదరణ పెంచుకుంటున్నారు. అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజల నుంచే ఓటింగ్ తీసుకుని భగవంత్ మన్ ను ఎంపిక చేశారు. తద్వారా ముఖ్యమంత్రి ఎంపిక అవకాశాన్ని ప్రజలకు ఇచ్చి, వారి మనసులో ఆప్ స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకునే పాచిక ఉపయోగించారు.
అలాగే, గోవా రాష్ట్రంలో శక్తిమంతమైన భండారి (ఓబీసీ) సామాజిక వర్గానికి చెందిన పాలేకర్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేజ్రీవాల్ బుధవారం ప్రకటించారు. తద్వారా కుల ఆయుధాన్ని ఎక్కు పెట్టారు. ‘‘అమిత్ పాలేకర్ వృత్తిరీత్యా న్యాయవాది. భండారి సామాజిక వర్గానికి చెందిన వారు. గోవా జనాభాలో భండారి కమ్యూనిటీ జనాభా 35 శాతంగా ఉంది. ఈ సామాజిక వర్గం నుంచి గతంలో ఒక్కరే రవి నాయక్ రెండేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మేము కుల రాజకీయాలు చేయడం లేదు. భండారి కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలే రాజకీయాలు సాగిస్తున్నాయి’’ అంటూ తన ప్రకటనతో పార్టీ వ్యూహాన్ని బయటపెట్టారు.
రాష్టంలో ప్రస్తుత పరిస్థితికి పాత పార్టీలే కారణమంటూ ఆప్ ను గెలిపించాలని కేజ్రీవాల్ గోవా ప్రజలను కోరారు. రాష్ట్రంలో అవినీతిని పాలేకర్ తుడిచేస్తారని, ప్రతి ఒక్కరి కోసం కష్టపడి పనిచేస్తారని ప్రకటించారు. అమిత్ పాలేకర్ గతేడాది అక్టోబర్ లో ఆప్ లో చేరడం గమనార్హం.