అత్యధిక ప్రజామోదం ఉన్న నేతగా ప్రధాని మోదీ.. ప్రపంచ లీడర్లలో నంబర్ 1
- భారత వయోజనుల్లో 71 శాతం మంది ఆమోదం
- తిరస్కరిస్తున్నది 21 శాతం మందే
- రెండో స్థానంలో మెక్సికో అధినేత మాన్యుయెల్
- జో బైడెన్ కు 43 శాతమే ఆమోదం
ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజామోదం కలిగిన నేతగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గుర్తింపు సాధించారు. భారత్ లో వయోజనుల్లో 71 శాతం మోదీని తమ నాయకుడిగా ఆమోదిస్తున్నారు. ఈ వివరాలను అమెరికాకు చెందిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాక్ మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 13 మంది నేతలకు సంబంధించి సర్వే నిర్వహించింది.
ఇందులో 71 శాతం మంది ప్రజామోదంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు. అంతేకాదు అతి తక్కువ తిరస్కరణ రేటు (21 శాతం) కూడా ఆయనకే ఉంది. అగ్ర రాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కు ఉన్న ప్రజామోదం కేవలం 43 శాతమే. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడేకు కూడా ఇంచుమించు ఇంతే ఆమోదం రేటు దక్కింది. బైడెన్ ఆరో స్థానంలో, ట్రూడే ఏడో స్థానంలో ఉన్నారు.
మెక్సికో అధినేత ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడర్ 66 శాతం రేటింగ్ తో రెండో స్థానం దక్కించుకున్నారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాఘికి 60 శాతం, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదకు 48 శాతం ఆమోదం రేటు లభించింది. 13 మందిలో అతి తక్కువ రేటింగ్ 26 శాతంతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిలవడం గమనార్హం. జర్మనీ చాన్స్ లర్ ఒలఫ్ స్కాల్జ్ 44 శాతం రేటింగ్ తో ఐదో స్థానంలో ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిస్ కు 41 శాతం ప్రజామోదం ఉంది.