Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గుడివాడలో కేసినో గొడవ …టీడీపీ వర్సెస్ వైసీపీ!

గుడివాడలో కేసినో గొడవ …టీడీపీ వర్సెస్ వైసీపీ!
-నాని కేసినో నిర్వహిస్తున్నారు టీడీపీ: నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా : కొడాలి నాని
-నిరూపించండి… పెట్రోల్ పోసుకుని అంటించుకుంటా కొడాలి నాని సవాల్
-నా కన్వెన్షన్లో కేసినోలు నిర్వహించినట్టు నిరూపించండి
-నిజనిర్ధారణకు వచ్చిన టీడీపీ నేతలంతా ఎన్నికల్లో ఓడిపోయినవారే
-చంద్రబాబు, లోకేశ్ లకు కేసినోలు బాగా తెలుసు

గుడివాడలో మంత్రి కొడాలి నాని కేసినో నిర్వహిస్తన్నారని టీడీపీ ఆరోపణల నేపథ్యంలో గుడివాడ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ కేసినో జరుగుతుందో లేదో తెలుసుకునేందుకు టీడీపీ నిజనిర్దారణ కమిటీ వేసింది.అది అక్కడకు వెళ్లి పరిశీలించి నివేదికను టీడీపీ హైకమాండ్ కు అందజేస్తుందని నాయకులూ చెప్పారు .అందుకు అనుగుణంగా టీడీపీ నేతలు గుడివాడ బయలుదేరారు . వారిని పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ కార్యకర్తలు టీడీపీ నాయకుల వాహనాలపై రాళ్లదాడి చేశారు . దీంతో గుడివాడ లో ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్నది . దీనిపై సవాళ్లు ,ప్రతిసవాళ్లుతో వాతావరణం వేడెక్కింది. కొడాలి నాని రాజీనామా చేయాలనీ టీడీపీ డిమాండ్ చేసింది. కేసినో నిరూపించలేకపోతే చంద్రబాబు నాయుడు , లోకేష్ లో ఏమి చేస్తారో చెప్పాలని నాని డిమాండ్ చేశారు .

గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్లో కేసినో ఆటను నిర్వహించారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రధానాస్త్రంగా మలుచుకుంటోంది. ఆ పార్టీకి చెందిన నేతలు నిజనిర్ధారణ కోసం గుడివాడకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఈ ఆరోపణలపై కొడాలి నాని తీవ్రంగా ప్రతిస్పందించారు.

తన కల్యాణమంటపం రెండున్నర ఎకరాల్లో ఉంటుందని… అక్కడ కేసినోలు, పేకాట వంటివి నిర్వహించినట్టు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటానని కొడాలి నాని సవాల్ విసిరారు. చంద్రబాబు టైమ్ అయిపోయిందని అన్నారు. ఈరోజు నిజనిర్ధారణకు వచ్చినవాళ్లంతా ఎన్నికల్లో ఓడిపోయిన వారేనని చెప్పారు.

రాష్ట్రంలో అన్ని చోట్ల జూదం జరిగిన విధంగానే గుడివాడలో కూడా జరిగిందని అన్నారు. మహిళలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని తనకు సమాచారం అందిన వెంటనే డీఎస్పీకి ఫోన్ చేసి అడ్డుకున్నానని చెప్పారు. చంద్రబాబుకు, నారా లోకేశ్ కు కేసినోలు బాగా తెలుసని అన్నారు.

తన కన్వెన్షన్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో, లేదో చెప్పడానికి గుడివాడ ప్రజలు ఉన్నారని… టీడీపీ నిజనిర్ధారణ కమిటీ అవసరం లేదని నాని అన్నారు. మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోందని మంత్రి మండిపడ్డారు.

గుడివాడలో టీడీపీ నేతల అరెస్ట్… తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేశ్

కృష్ణా జిల్లా గుడివాడలో కొడాలి కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో ఏర్పాటు చేశారంటూ టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే. దీనిపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. అయితే, గుడివాడ వెళ్లి క్యాసినో నిగ్గు తేల్చేందుకు ప్రయత్నించిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వర్ల రామయ్య, బోండా ఉమ, ఆలపాటి రాజా, మరికొందరు ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాసినో నిర్వహించి ప్రజల నుంచి వందల కోట్లు కాజేసిన గడ్డం గ్యాంగ్ ను వదిలేసి నిజనిర్ధారణకు వెళ్లిన టీడీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. మహానుభావుల పురిటిగడ్డ గుడివాడను గడ్డం గ్యాంగ్ భ్రష్టుపట్టించిందని విమర్శించారు. మింగడానికి ఏమీ మిగలక ఆఖరికి జనాల ఒంటిపై ఉన్న గుడ్డలు సైతం లాగేసేందుకు ఏకంగా క్యాసినో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

కే కన్వెన్షన్ జూదానికి అడ్డాగా మారిన విషయం ప్రపంచం మొత్తానికి తెలిసినా, వైసీపీ రంగులతో కళ్లు మూసుకుపోయిన పోలీసులకు కనిపించలేదని లోకేశ్ విమర్శలు చేశారు. దీని వెనకున్న అసలైన సూత్రధారులపై చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విచ్చలవిడిగా క్యాసినో నడిపినప్పుడు అడ్డురాని కొవిడ్ నిబంధనల పేరు చెప్పి టీడీపీ నేతలను అడ్డుకోవడం వైసీపీ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

గుడివాడలో ఉద్రిక్తత… టీడీపీ నేత బోండా ఉమ కారుపై రాళ్ల దాడి

కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో కేసినో నిర్వహించారంటూ వస్తున్న వార్తలు రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గుడివాడకు వెళ్లింది.

ఈ నేపథ్యంలో కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో గుడివాడలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించారు. టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. అంతేకాదు టీడీపీ నేత బోండా ఉమ కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

కొడాలి నానిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: అచ్చెన్నాయుడు

గుడివాడలో టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు చేసిన దాడి దారుణమని అచ్చెన్నాయుడు అన్నారు. గంజాయి బ్యాచ్ టీడీపీ నేతలను హత్య చేసేందుకు యత్నించారని ఆరోపించారు. గుడివాడను ఇప్పటికే మట్కా, వ్యసనాలకు కేంద్రంగా మార్చేశారని… ఇప్పుడు కేసినో గుట్టు బయటపడుతుందనే భయంతో గుడివాడ గుట్కా బ్యాచ్ వీరంగం వేసిందని మండిపడ్డారు. మంత్రి కొడాలి నాని కోడె త్రాచుగా మారారని… యువత జీవితాలను నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రివర్గం నుంచి కొడాలిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యే కావాలంటున్న కర్ణాటక ప్రజలు ..

Drukpadam

ఏపీ బీజేపీ లో ఇంటర్నల్ వార్ …వీర్రాజుపై కన్నా లక్ష్మీనారాయణ ఫైర్!

Drukpadam

అంబేద్కర్ కు నిజమైన వారసుడు కేసీఆరే!: మోత్కుపల్లి నర్సింహులు!

Drukpadam

Leave a Comment