జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి!
-జగన్ సంక్షేమ పథకాలు నచ్చే వైసీపీలో చేరానన్న హైమావతి
-మహిళలకు జగన్ అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారని కితాబు
-గిరిజన మహిళకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని ప్రశంస
టీడీపీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తామే అధికారంలోకి వస్తామని చెబుతున్న టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కొద్దినెలల క్రితం జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో సైతం అధికార వైసీపీ తిరుగులేకుండా పంచాయతీలు , మున్సిపాలిటీలు , జడ్పీటీసీ ,ఎంపీటీసీ లను గెలుచుకుంది . తాజాగా వైపుకి చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ లో చేరడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
విజయనగరం జిల్లా ఎస్.కోట టీడీపీ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆమెను పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మీడియాతో హైమావతి మాట్లాడుతూ, మహిళలకు జగన్ అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని కొనియాడారు. పేద మహిళలందరికీ ప్రభుత్వ సాయం అందుతోందని అన్నారు. గిరిజన మహిళకు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చి గౌరవించారని ప్రశంసించారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చే వైసీపీలో చేరానని తెలిపారు. విజయనగరం జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఉత్తరాంధ్ర అభివృద్ధికి కావాల్సిన అన్ని పనులు జగన్ చేస్తున్నారని అన్నారు.