Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఓఆర్ఆర్–ఆర్ఆర్ఆర్ మధ్య వెయ్యి ఎకరాల్లో లే అవుట్లకు హెచ్ఎండీఏ కసరత్తులు!

ఓఆర్ఆర్–ఆర్ఆర్ఆర్ మధ్య సామాన్యులకు అందుబాటు ధరల్లో ప్లాట్లు.. వెయ్యి ఎకరాల్లో లే అవుట్లకు హెచ్ఎండీఏ కసరత్తులు!

  • రాబోయే రెండు మూడేళ్లలో అభివృద్ధికి ప్లాన్
  • ఇప్పటికే కొత్తూరు, కందుకూరు, నర్వల్లో 173 ఎకరాల సేకరణ
  • దండు మల్కారంలో 300 ఎకరాల సేకరణకు ప్రణాళిక
  • కొన్ని చోట్ల రైతుల అభిప్రాయాల సేకరణ

మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లోనే ప్లాట్లు వచ్చేలా హెచ్ఎండీఏ లే అవుట్లను వేసేందుకు కసరత్తులు చేస్తోంది. అది కూడా ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్), రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) మధ్య భూముల్లోనే ప్లాట్లను అభివృద్ధి చేయాలని చూస్తోంది. రైతుల నుంచి భూమిని సేకరించి ప్లాట్లుగా మార్చాలని భావిస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల భూములపై ప్రాథమిక అధ్యయనం చేసింది. రైతుల అభిప్రాయాలను కోరింది. కొన్ని చోట్ల భూమిని సేకరించింది. కొన్ని ప్రాంతాల్లో రైతులు సానుకూలంగా ఉన్నప్పటికీ.. మరికొన్ని చోట్ల వ్యతిరేకత వ్యక్తమైందని అధికారులు అంటున్నారు.

ఇప్పటికే సేకరించిన 173 ఎకరాల్లో ప్రస్తుతం లే అవుట్లను సిద్ధం చేయాలని హెచ్ఎండీఏ ప్రణాళికలు వేస్తోంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు, కందుకూరు మండలాల్లోని లేమూరులో 82 ఎకరాలు, ఇన్ముల్ నర్వలో 91 ఎకరాలను హెచ్ఎండీఏ ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించింది. భూమార్పిడి తదితర చర్యలనూ ఇప్పటికే చేపట్టిందని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం అనుమతి వచ్చిన వెంటనే లే అవుట్లను అభివృద్ధి చేయనున్నారు.

150 గజాలు, 200 గజాల నుంచి పెద్ద పరిమాణంలో ప్లాట్లను వేయనున్నట్టు తెలుస్తోంది. చౌటుప్పల్ మండలంలోని దండు మల్కారంలో 300 ఎకరాల్లోనూ ప్లాట్ల అభివృద్ధికి ఇప్పటికే హెచ్ఎండీఏ పరిశీలన చేసింది. స్వాములవారి లింగోటంలో 50, బోగారంలో 250, బండ రావిర్యాలలోని 60 ఎకరాల్లో ప్లాట్లను వేసేందుకు కసరత్తులు చేస్తోంది. మొత్తంగా వచ్చే రెండు, మూడేళ్లలో వెయ్యి ఎకరాలలో ప్లాట్లను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది.

వాస్తవానికి హుడా.. హెచ్ఎండీఏగా మారిన తర్వాత హైదరాబాద్ నగరం చుట్టూ లే అవుట్లను అభివృద్ధి చేసి వేలం ద్వారా విక్రయించింది. 100, 150, 200, 500, 600 చదరపు గజాల చొప్పున ప్లాట్లను అమ్మింది. ప్రభుత్వమే అమ్మడంతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు విపరీతంగా భూములను కొనేశారు. ఉప్పల్ భగాయత్ ప్లాట్లే అందుకు నిదర్శనం. మిగిలిపోయిన భూములను ఇటీవల వేలం వేస్తే రూ.కోట్లు వచ్చాయి. దీంతో ఇప్పుడు సామాన్యులకు భూములు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఈనేపథ్యంలోనే సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్లాట్లను అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ కసరత్తులు చేస్తోంది.

Related posts

బిగ్ బాస్ పై కంటెస్టెంట్ విమర్శలు …తనకు అన్యాయం జరిగిందని ఆరోపణలు !

Drukpadam

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదిగో..!

Drukpadam

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Drukpadam

Leave a Comment