పంతం నెగ్గించుకున్న కర్ణాటక రైతు… ఇంటివద్దకే వచ్చి బొలేరో వాహనం అందించిన షోరూం సిబ్బంది!
- కర్ణాటకలో ఘటన
- వాహనం కొనేందుకు వెళ్లిన రైతు
- అవమానించిన షోరూం సిబ్బంది
- గంటలో రూ.10 లక్షలతో వచ్చిన రైతు
- కారు డెలివరీ ఇవ్వాలంటూ సత్తా చాటిన వైనం
ఇటీవల కర్ణాటకలో ఓ రైతు ఆత్మాభిమానం ప్రదర్శించిన ఘటన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కెంపెగౌడ అనే రైతు మహీంద్రా వాహనం కొనేందుకు తుముకూరులో కంపెనీ షోరూంకు వెళ్లగా, అక్కడ ఆ రైతును సేల్స్ సిబ్బంది కించపరిచేలా మాట్లాడడం తెలిసిందే.
ఆ రైతు వేషధారణ చూసిన ఓ సేల్స్ మన్ “కారు ధర రూ.10 అనుకుని వచ్చావా?” అంటూ వ్యంగ్యంగా మాట్లాడగా, గంటలో రూ.10 లక్షలతో తిరిగొచ్చిన రైతు… కారును డెలివరీ ఇవ్వాలంటూ తన సత్తా ఏంటో చూపించాడు. దాంతో కంగుతిన్న మహీంద్రా షోరూం వర్గాలు మూడ్రోజుల్లో వాహనం అందజేస్తామని, ఈ రైతుకు తమ ప్రవర్తన పట్ల క్షమాపణ చెప్పాయి.
తాజాగా, షోరూం వర్గాలు మహీంద్రా బొలేరో వాహనాన్ని రైతు కెంపెగౌడ ఇంటి వద్దకు డెలివరీ ఇచ్చాయి. అంతేకాదు, ఆయనకు మరోసారి క్షమాపణలు చెప్పాయి. దీనిపై కెంపెగౌడ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. తనకు జరిగిన అవమానం మరెవరికీ జరగకూడదని కోరుకుంటున్నానని తెలిపాడు. వాహనాన్ని సకాలంలోనే డెలివరీ ఇచ్చారని వెల్లడించాడు. కాగా, ఈ వ్యవహారంపై మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. రైతు కెంపెగౌడను తమ మహీంద్రా కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానించారు.