ఖమ్మం లో నిర్మాణంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ
-సకల హంగులతో తీర్చిదిద్దుతున్న వైనం
-అతిత్వరలోనే ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
-21 కోట్ల వ్యయంతో శరవేగంగా సాగుతున్న భవన నిర్మాణం
-పనులను పరిశీలించిన మంత్రి అజయ్
ఖమ్మం ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలు అందించేందుకు 21 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. భవన నిర్మాణ పనులను శుక్రవారం మంత్రి పరిశీలించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన దిశగా నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందన్నారు.
హైదరాబాద్ జిహెచ్ఎంసి కార్యాలయం తర్వాత రాష్ట్రంలో మరే కార్పొరేషన్ కార్యాలయం లేనివిధంగా ఆధునిక వసతులతో భవనాన్ని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక డిజైన్‌తో ఉద్యోగులు, ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. సుమారు 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న కార్యాలయాన్ని మార్చిలోగా నిర్మాణ పనులు పూర్తిచేసి రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నామని మంత్రి అజయ్ వెల్లడించారు. మీ సేవ, టౌన్ ప్లానింగ్ తదితర సదుపాయాలు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు.
సీఎం కేసిఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో నగరంలో రూ.1000 కోట్లపైగా నిధులతో అభివృద్ది చేసిన ఘనత తెరాసదేనని మంత్రి అజయ్ స్పష్టం చేశారు. నగరపాలక సంస్థకు ఏటా రూ.100 కోట్లు ప్రభుత్వం ఇస్తుందని ఆ నిధులతో అంతర్గత రహదారులు, మంచినీటి వసతి, ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్, వాడవాడలా సీసీ రోడ్లు, సైడు కాలువలు, జనాభా ప్రతిపాదికన కూరగాయల మార్కెట్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టామని, గ్రేటర్ తరహాలో కార్పొరేషన్ కార్యాలయ భవనం తోపాటు ఖమ్మం ఎన్నెస్పీ, మరికొన్ని ప్రాంతాల్లో రూ.10 కోట్లతో ఏసీ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.