చెప్పేది వినని సభ్యుడికి నేను ఎలా బదులిచ్చేది?: రాహుల్ ప్రశ్నలపై మోదీ స్పందన!
- సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్
- దానికి తనదైన శైలిలో స్పందించిన మోదీ
- చర్చలనే నమ్ముతాము, దాడులను కాదన్న ప్రధాని
లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు రాహుల్ గాంధీ తీరును ప్రధాని మోదీ తప్పుబట్టారు. సభలో కూర్చొని, చెప్పేది వినని సభ్యుడికి తాను బదులిచ్చేది లేదన్నారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశంలో నిరుద్యోగం, భారత్-చైనా అంశాలపై రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నలను మీడియా ప్రతినిధి గుర్తు చేశారు.
దీనికి ప్రధాని స్పందిస్తూ. ‘‘ప్రతీ అంశంపై నేను వాస్తవాలు అందించాను. నిజాల ఆధారంగా ప్రతీ అంశంపై మాట్లాడాను. కొన్ని అంశాల్లో విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి లోతైన సమాధానాలు ఇచ్చారు. అవసరమైన సందర్భాల్లో నేనూ మాట్లాడాను. కానీ, సభలో కూర్చొని, వినని సభ్యుడికి నేను సమాధానం చెప్పేది ఎలా? అని మోదీ పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం చర్చలనే కానీ, దాడులను విశ్వసించదన్నారు. ‘‘ఎవరిపైనా దాడి చేయబోము. దానికి బదులు చర్చలను నమ్ముతాము. చర్చలన్నప్పుడు అవరోధాలు ఉంటుంటాయి. నేను దీన్ని స్వాగతిస్తాను. అందుకనే నేను చిరాకు పడడానికి కారణం ఏదీ లేదు’’అని మోదీ అన్నారు.