కాపు రిజర్వేషన్ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన జీవీఎల్ నరసింహారావు!
- కాపులు అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారు
- 2017లో ఏపీ అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లును పాస్ చేశారు
- ఏపీ ప్రభుత్వం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలన్న జీవీఎల్
ఏపీలో కాపు రిజర్వేషన్ల కోసం భారీ ఉద్యమం కొనసాగిన సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పెద్దల సభలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ లో కాపులు ఆర్థికంగా, సామాజికంగా, విద్య పరంగా వెనుకబడి ఉన్నారని అన్నారు. తమకు రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలని మూడు దశాబ్దాలుగా కాపులు ఉద్యమాలు చేశారని తెలిపారు.
ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీలో 2017లో విద్యా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ బిల్లును పాస్ చేసినా, రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లు పాస్ చేసిందని చెప్పారు.
రిజర్వేషన్ల కోసం వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఉందని… అయినప్పటికీ బిల్లు ఆమోదం కోసం దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపారని ఆయన మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్ బిల్లును సమ్మతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపలేదని… కాపుల బిల్లును మాత్రమే పంపారని విమర్శించారు.
రిజర్వేషన్లను కల్పించాల్సిన బాధ్యతను కేంద్రంపై మోపాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. కాపులకు వెంటనే రిజర్వేషన్ అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. లేకపోతే వైసీపీ ప్రభుత్వం కాపుల ఆగ్రహాన్ని చూడవలసి వస్తుందని చెప్పారు.