తండ్రిలాంటి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి.. చేతులు జోడించి అడుగుతున్నాం: జగన్ తో చిరంజీవి
- నిన్న జగన్ తో భేటీ అయిన సినీ ప్రముఖులు
- పరిశ్రమను ఆదుకోవాలని సీఎంను కోరిన చిరంజీవి
- మీరు తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని కితాబు
సినీ పరిశ్రమ సమస్యలకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో నిన్న సినీ ప్రముఖులు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్ తదితరులు జగన్ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పరిశ్రమను ఆదుకోవాలంటూ జగన్ ను చిరంజీవి కోరారు.
‘ఉభయులకు సామరస్యంగా ఉండేలా, ఉభయులకు ఉపయోగపడే విధంగా మీరు మధ్యంతరంగా నిర్ణయం తీసుకోవడం చాలాచాలా బాగుందండి. ఇక్కడకు వచ్చిన తర్వాత అందరం సంతోషించాం. కచ్చితంగా ఇది మా అందరికీ చాలా వెసులుబాటు. ముఖ్యంగా ఎగ్జిబిటర్స్ రంగానికి బాగుంటుంది. తెలుగుదనాన్ని, తెలుగు సినిమాని కాపాడే దిశగా మీరున్నారు. అది కొనసాగించే దిశగా మీ చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి. మీరు తండ్రిలాంటి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి… దట్స్ ఇట్’ అని చిరంజీవి అన్నారు.
మరోవైపు సినీ ప్రముఖుల విన్నపాలపై జగన్ సానుకూలంగా స్పందించారు. ఐదో షో వేసుకోవడానికి ఆయన అంగీకరించారు. మిగిలిన సమస్యలపై తదుపరి జరిగే కమిటీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నారు.