రాజకీయపార్టీల డ్రామాలు పక్కన పెట్టి ఆత్మహత్యలను నిరోదించండి …షర్మిల
-తెలంగాణ ఎలా ఏర్పడిందని కొట్టుకు చావడం పక్కన పెట్టండి
-తెలంగాణలో చావులు లేకుండా చూడాలి
-రాజకీయ పార్టీలు డ్రామాలు ,నాటకాలు కట్టి పెట్టాలి
-రాష్ట్రంలో ఆత్మహత్యలు జరగకుండా చూడాలన్న షర్మిల
”తెలంగాణ ఇచ్చిన వారికైనా.. తెలంగాణ తెచ్చిన వారికైనా.. తెలంగాణ కోసం కొట్లాడిన వారికైనా.. ఎవరికైనా తెలంగాణ సాధించిన పుణ్యం దక్కాలంటే.. సాధించిన తెలంగాణలో చావులు లేకుండా చూడాలి” అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యల గురించి పట్టించుకోని వారు తెలంగాణ ఎలా ఏర్పడిందని కొట్టుకు చస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాజకీయ పార్టీలు డ్రామాలు పక్కనపెట్టి రాష్ట్రంలో ఆత్మహత్యలు జరగకుండా చూడాలని ఆమె సూచిస్తూ ఓ ప్రకటన చేశారు.
అలాగే, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అందాల్సిన పరిహారం అందకుండా జాప్యం చేస్తుండడంపై షర్మిల మండిపడ్డారు. ”మాట ఇస్తే తల నరుక్కొంటాడు తప్పితే.. మాట తప్పే మనిషి కాదు దొరగారు. 7 ఏండ్ల కింద ఆత్మహత్య చేసుకొన్న 133 మంది రైతులకు ఎక్స్ గ్రేషియా ఇచ్చింది లేదు. తల నరుక్కొన్నది లేదు. 6 లక్షలు ఇస్తామని 2015లో ఇచ్చిన జీవో కాగితాలకే పరిమితమైంది తప్పితే రైతు కుటుంబాలకు మాత్రం ఇప్పటివరకు పరిహారం అందలేదు
దొరకు కోర్టులు మొట్టికాయలు వేస్తేకానీ ఇచ్చిన జీవో గుర్తుకు రాదు. కరోనా టెస్టులు పెంచాలని, టీఎస్‌పీఎస్సీ సభ్యులను భర్తీ చేయాలని, రాష్ట్రంలో కమిషన్లను ఏర్పాటు చేయండని, ఆఖరికి చనిపోయిన రైతులను ఆదుకోండని కోర్టులే చెప్పాలి. కోర్టులు చెబితేకానీ బాధ్యతలు గుర్తుకురాని చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు” అని షర్మిల ట్వీట్ చేశారు.