హర్యానా సర్కారుకు సుప్రీంకోర్టులో ఊరట.. ప్రైవేటు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే!
- హైకోర్టు విధించిన స్టే ఎత్తివేత
- కేసు వాస్తవాల్లోకి వెళ్లడం లేదు
- నాలుగు వారాల్లోగా విచారణ ముగించాలి
- పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టును కోరిన సుప్రీంకోర్టు
ప్రైవేటు రంగంలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే చెందాలన్న అంశంలో హర్యానా రాష్ట్ర సర్కారుకు తాత్కాలిక ఊరట దక్కింది. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే చెందాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదేశాలపై పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు లోగడ స్టే విధించగా, సుప్రీంకోర్టు తాజాగా దాన్ని ఎత్తివేసింది.
అయితే, కొత్త చట్టాన్ని అమలు చేయని ప్రైవేటు సంస్థలపై బలవంతపు చర్యలకు దిగొద్దని ఈ సందర్భంగా హర్యానా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేటు పరిశ్రమలు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టును లోగడ ఆశ్రయించాయి. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఈ చట్టం అమలుపై హైకోర్టు స్టే విధించడం గమనార్హం. దీన్ని సుప్రీంకోర్టు ముందు హర్యానా సర్కారు సవాలు చేసింది.
తాజాగా ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని, నాలుగు వారాల్లోగా దీన్ని పూర్తి చేయాలని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. ‘‘మేము ఈ అంశంలోని వాస్తవాల జోలికి వెళ్లడం లేదు. నాలుగు వారాలకు మించకుండా విచారణ వేగంగా పూర్తి చేయలని హైకోర్టును కోరుతున్నాము’’ అని జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
విచారణ సందర్భంగా ఫరీదాబాద్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ‘‘కొత్త చట్టం వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి. చిన్న సంస్థలు రిజర్వ్ డ్ కోటాకు సరైన అభ్యర్థులు లభించకపోతే మూసేసుకోవాల్సి వస్తుంది. ప్రైవేటు ఆసుపత్రులపై ఎక్కువ ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది నర్సులు కేరళ రాష్ట్రానికి చెందినవారే వున్నారు’’ అని వివరించారు.