ఏపీకి పాకిన హిజాబ్ వివాదం.. విజయవాడలో విద్యార్థినులను అనుమతించని లయోలా కాలేజీ..
- రంగంలోకి దిగిన కలెక్టర్, పోలీస్ కమిషనర్
- సర్దిచెప్పడంతో అనుమతించిన కాలేజ్ ప్రిన్సిపల్
- రేపటి నుంచి అనుమతించే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
కర్ణాటకలో ముదిరిన హిజాబ్ వివాదం.. ఇప్పుడు ఏపీకీ పాకింది. విజయవాడలోని లయోలా కాలేజీలో బురఖా ధరించి వచ్చిన విద్యార్థినులను క్లాసులోకి అనుమతించలేదు. బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినులను గేటు వద్దే సెక్యూరిటీ సిబ్బంది ఆపేశారు. వారిని గమనించిన ప్రిన్సిపాల్ కిషోర్.. బురఖా, హిజాబ్ ఎందుకు వేసుకొచ్చారని, అది తీసేసి రావాలని వారికి చెప్పారు.
క్లాసు లోపలికి వెళ్లాక తీసేస్తామని వారు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. తాము ఇప్పటిదాకా హిజాబ్ తోనే క్లాసులు వింటున్నామని, హిజాబ్ తోనే ఐడీ కార్డులున్నాయని పేర్కొన్నారు. వివాదం నేపథ్యంలో విద్యార్థినుల తల్లిదండ్రులు, మతపెద్దలు కాలేజీ దగ్గరకు వచ్చి ప్రిన్సిపాల్ తో మాట్లాడారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు కూడా కాలేజీ దగ్గరకు చేరుకున్నారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్ సర్దిచెప్పడంతో విద్యార్థినులను హిజాబ్ తోనే తరగతులకు అనుమతించారు.
కాగా, ప్రస్తుతానికి హిజాబ్ వివాదం సద్దుమణిగినా.. రేపటి నుంచి హిజాబ్ ను అనుమతించాలా? వద్దా? అనే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ప్రిన్సిపాల్ చెప్పారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ తాను విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడం చూడలేదని, ఇప్పుడే కొత్తగా ఎందుకు వేసుకొస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన తెలిపారు. కళాశాల నిబంధనల ప్రకారం అందరూ యూనిఫాంలలోనే రావాలని తేల్చి చెప్పారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్, మత పెద్దలతోనూ ఇదే విషయాన్ని చెప్పానన్నారు.
ప్రశాంతంగా ఉన్న ఏపీలో మతకలహాలు సృష్టించాలని చూస్తే ఊరుకోబోమని మత పెద్దలు ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. లయోలా కాలేజీకి వందల ఏళ్ల చరిత్ర ఉందని, ఇక్కడ ఘర్షణ వాతావరణం సృష్టించొద్దని చెప్పారు. ముస్లిం ఆడపిల్లలకే కాకుండా.. వేరే ఆడపిల్లలకూ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోబోమని చెప్పారు.