- ఉద్దవ్ ,శరద్ పవర్ తో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు …
-బీజేపీ యేతర శక్తుల సమీకరణ దిశగా కేసీఆర్
-సత్పలితాలు ఇస్తున్న కేసీఆర్ టూర్ లు
-ఇంకా అనేకమంది ప్రాంతీయ నేతలను కలుస్తానని వెల్లడి
-ముగిసిన కేసీఆర్, థాకరే సమావేశం
-సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు
-అనంతరం శరద్ పవర్ తో భేటీ
-అనేక అంశాలపై లోతుగా చర్చించామన్న కేసీఆర్
-దేశంలో మరిన్ని మార్పులు రావాల్సి ఉందని వెల్లడితెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ యేతర శక్తులను కూడగట్టే పనిలో భాగంగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే ఆహ్వానం మేరకు ఆదివారం ముంబై వెళ్లారు. అక్కడ ఇద్దరు రాజకీయ ఉద్దండులను కలిశారు . వారిలో ఒకరు సీఎం ఉద్దవ్ థాకరే కాగా ,మరొకరు దేశ రాజకీయాల్లోనే తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న శరద్ పవర్ కావడం విశేషం .
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. అనంతరం, కేసీఆర్, థాకరే సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, దేశంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకే ముంబయి వచ్చానని తెలిపారు. ఇరువురి మధ్య లోతైన చర్చ జరిగిందని, అనేక అంశాలపై సమాలోచనలు చేశామని తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో మరిన్ని చర్చలు జరుపుతామని చెప్పారు. ఇంకా అనేకమంది ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
తెలంగాణ, మహారాష్ట్ర మధ్య వెయ్యి కిలోమీటర్ల సరిహద్దు ఉందని, తెలంగాణ, మహారాష్ట్ర సోదర రాష్ట్రాలని తెలిపారు. హైదరాబాద్ రావాలని సీఎం ఉద్ధవ్ థాకరేను కోరుతున్నానని అన్నారు. రెండు రాష్ట్రాలు అనేక అంశాల్లో కలిసి పనిచేయాల్సి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. దేశంలో మరిన్ని మార్పులు రావాల్సి ఉందని అభిలషించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానాలు మారాల్సిందేనని స్పష్టం చేశారు.
కాగా, సీఎం ఉద్ధవ్ థాకరేతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ ఉద్ఘాటించారు.
ముంబయిలో మహా సీఎం ఉద్ధవ్ థాకరేతో కేసీఆర్ సమావేశం
- ముంబయి చేరుకున్న సీఎం కేసీఆర్ బృందం
- తన నివాసంలో సాదర స్వాగతం పలికిన ఉద్ధవ్ థాకరే
- సీఎం బృందంలో కవిత, ఎంపీలు రంజిత్ రెడ్డి, సంతోష్ కుమార్
- ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించే అవకాశం
ముంబయి చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ బృందానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సాదర స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్, కల్వకుంట్ల కవిత, ఎంపీలు రంజిత్ రెడ్డి, సంతోష్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి విమానాశ్రయం నుంచి నేరుగా ఉద్ధవ్ థాకరే అధికారిక నివాసానికి తరలి వెళ్లారు. థాకరే నివాసానికి వచ్చినవారిలో కేసీఆర్ వెంట ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నారు.
సీఎం కేసీఆర్ కొంతకాలంగా బీజేపీ వ్యతిరేక పోరు సాగిస్తున్న సంగతి తెలిసిందే. తనలాంటి భావజాలం ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీలను కూడా కలుపుకుని పోవాలని ఆయన భావిస్తున్నారు. కాగా, సీఎం ఉద్ధవ్ థాకరేతో సమావేశంలో జాతీయస్థాయిలో కొత్త ఫ్రంట్ అంశం చర్చకు రానుంది. ప్రస్తుత రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.