ప్రతిపక్ష పార్టీలతో త్వరలో సోనియా గాంధీ భేటీ!
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు
వాటి ఫలితాల అనంతరం సమావేశం
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు చర్చలు
దేశ రాజకీయాల్లో రాజకీయ పార్టీల మధ్య ఎత్తులు పై ఎత్తులతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 2024 ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకొని వివిధ పార్టీల నేతలు తమ బుర్రలకు పదును పెడుతున్నారు .ఇప్పటికే బీజేపీ యేతర శక్తులను కూడదీసే చర్యలకు తెలంగాణ సీఎం కేసీఆర్ నడుం బిగించారు . ఇందుకోసం ఆయన వివిధ రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు . నేడు ముంబై వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ను కలిసి బీజేపీ యేతర ఫ్రంట్ పై చర్చించారు . అంతకు ముందు స్టాలిన్ ,మమతా బెనర్జీ , తేజశ్వని యాదవ్ లతో సమావేశం అయ్యారు . మరికొంత మందిని కలిసే అవకాశం ఉందని అన్నారు . ఇది ఇలా ఉండగా మరో వైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రతిపక్షాలను కూడగట్టే పనిలో ఉన్నారు . అందుకు మరికొద్ది రోజుల్లో ఆమె ప్రతిపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించనున్నారు . ఇందులో ఉద్దండులైన నేతలను ఆహ్వానించే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 2024 లోకసభ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పునరేకీకరణకు పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. మరో వైపు బీజేపీ కూడా ఇప్పటి నుంచే కేంద్రం లో తిరిగి అధికారం చేపట్టేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది.
దేశంలోని ప్రతిపక్ష పార్టీలను కూడగట్టి బీజేపీపై పోరాడడానికి ఓ వైపు కేసీఆర్ ఈ రోజు ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే , రాజకీయ కురువృద్ధుడు శరద్ పవర్ లను లను కలిసి రాజకీయాలపై వారితో చర్చలు జరిపారు . యూపీఏయేతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేయడానికి ఆయన ప్రయత్నాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ప్రతిపక్ష పార్టీలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుతం జరుగుతోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం ఈ సమావేశం నిర్వహించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయాలన్న లక్ష్యంతోనే ఈ భేటీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలతో ఏయే అంశాలపై చర్చించాలన్న విషయాలను సోనియా గాంధీ ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా ఆహ్వానించనున్నారు.