సొంత పార్టీ నేత వసూళ్ల దందాపై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం
- ఎమ్మెల్యే పేరు చెప్పి మండల స్థాయి నేత వసూళ్లు
- ప్రభుత్వ భూములకు కూడా పట్టాలిప్పించేస్తారట
- విడవలూరు మండల నేతపై ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఆరోపణలు
- తీరు మార్చుకోకపోతే పార్టీ నుంచి బహిష్కరిస్తామని వార్నింగ్
తన పేరు చెప్పుకుని తన పార్టీకే చెందిన ఓ నేత వసూళ్లకు పాల్పడుతున్నాడని నెల్లూరు జిల్లా కొవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్వయంగా చెప్పారు. ఈ మేరకు సదరు దందారాయుడికి ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
కోవూరు నియోజకవర్గ పరిధిలోని విడవలూరు మండలం పొన్నపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విడవలూరు మండలానికి చెందిన తమ పార్టీ నేత ఒకరు వసూళ్లకు పాల్పడుతున్నారని సంచలన వ్యాఖ్య చేశారు.
ప్రభుత్వ భూములకు పట్టాలిప్పిస్తామని.. అది కూడా ఎమ్మెల్యేలైన తనతోనే పట్టాలిప్పిస్తానని సదరు నేత వసూళ్లకు పాల్పడ్డారని నల్లపురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా రైతుల నుంచే కాకుండా విపక్షానికి చెందిన నేతల వద్ద కూడా ఆ నేత వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. సదరు నేతకు ఇప్పటికే చాలాసార్లు చెప్పానని, ఇకనైనా వైఖరి మార్చుకోకపోతే పార్టీ నుంచి బహిష్కరిస్తామని నల్లపురెడ్డి హెచ్చరించారు.