పవన్ కల్యాణ్, నాగబాబుకు కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి కొడాలి నాని
- రామోజీరావు, రాధాకృష్ణ వంటి వారు పవన్ శ్రేయోభిలాషులు కాదు
- వారంతా చంద్రబాబు నాయుడి శ్రేయోభిలాషులు
- చంద్రబాబు నాయుడు బాగుండడం కోసం పనిచేస్తున్నారు
- పవన్ కల్యాణ్ ను తప్పుదోవ పట్టిస్తున్నారు
- పవన్, నాగబాబు, వారి అభిమానులకు మేము చెప్పేది ఇదే
ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విషయంలో రాజుకున్న వివాదంపై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఇటీవల నాగబాబుతో పాటు పలువురు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ సినిమాపై కొందరు అనవసర రాద్ధాంతం చేయిస్తున్నారని చెప్పారు. రామోజీరావు, రాధాకృష్ణ వంటి వారు పవన్ కల్యాణ్ శ్రేయోభిలాషులు కాదని, వారంతా చంద్రబాబునాయుడి శ్రేయోభిలాషులని ఆయన అన్నారు.
చంద్రబాబునాయుడు బాగుండడం కోసం పవన్ కల్యాణ్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. పవన్ కల్యాణ్, నాగబాబు, వారి అభిమానులకు తాము చెప్పేది ఇదేనని ఆయన చెప్పారు. ”ఏ సినిమా అయినా ఈ రోజుల్లో నాలుగు వారాల కంటే ఎక్కువగా ఆడడం లేదు. ఆ తర్వాత ఓటీటీలో విడుదల చేస్తూనే ఉంటారు. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయోజనాల కోసమే సినిమాను వాడుకుంటున్నారు.
ఓ నిర్ణయం తీసుకోవాలంటే చాలా కాలం పడుతుంది. సినిమా థియేటర్ల విషయంలో కమిటీ వేశాం. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా అన్ని అంశాలను పరిశీలించాలి. ఈ మధ్యే మంత్రి గౌతమ్‌రెడ్డి మరణించారు. టికెట్ల విషయంలో ఇంకొన్ని రోజులు పడుతుంది. ఈ విషయాలన్నీ భీమ్లా నాయక్ నిర్మాతలకు తెలుసు. ఆ సినిమాలో నటించిన పవన్ కల్యాణ్ గారికి కూడా తెలుసు.
అయినప్పటికీ ఈనెల 25నే సినిమాను ఉద్దేశపూర్వకంగా విడుదల చేశారు. ఓ వైపు సినీ పరిశ్రమ తల్లిలాంటిదని పవన్ కల్యాణ్ చెబుతారు. మరోవైపు, అర్థాంతరంగా సినిమా విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని నిర్మాతలకు నష్టం తీసుకొచ్చారు. తన కోసమే థియేటర్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తోందని పవన్ అంటున్నారని చెప్పారు.
పవన్ కల్యాణ్‌కు అందాల్సిన పారితోషికం ఇప్పటికే అందిందని అన్నారు. ఆయన చంద్రబాబునాయుడు ఇచ్చిన సలహాలను అనుసరిస్తున్నారు. ఆయన మీ శ్రేయోభిలాషి కాదు. వచ్చే ఎన్నికల్లో మీరు పొత్తు పెట్టుకుంటే ఓడిపోయే సీట్లను జనసేనకు ఇస్తారు. చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చూడాలన్న పాలసీతో మీరు పనిచేస్తే మీకు ఉపయోగం ఉండదు. పవన్ కల్యాణ్ సొంత అన్న చిరంజీవిపై కూడా కొందరు విమర్శలు చేస్తున్నారు. వంగి వంగి దండాలు పెట్టారని అంటున్నారు. చిరంజీవిని జగన్ మొదటి నుంచి గౌరవిస్తున్నారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ మర్చిపోయారా?” అని కొడాలి నాని ప్రశ్నించారు.