‘ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’.. ప్రపంచంలోనే శక్తిమంతమైన బాంబును రష్యా ప్రయోగిస్తుందన్న ఆందోళన.. ఉక్రెయిన్ కు తరలించిన రష్యా!
- ‘టీవోఎస్’ థర్మోబారిక్ బాంబు లాంచర్లను తరలించిన రష్యా సైన్యం
- హెచ్చరించిన అమెరికా, బ్రిటన్ నిఘా వర్గాలు
- ప్రయోగిస్తే 300 నుంచి 600 మీటర్ల దాకా పేలుడు ప్రభావం
- పేలాక ఏర్పడే వేవ్స్ తో మరింత ప్రమాదం
ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్.. ఇప్పుడు ఉక్రెయిన్, నాటో సహా ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్న అత్యంత భయంకరమైన బాంబిది. అవును మరి, అణ్వాయుధాల తర్వాత అంత శక్తిమంతమైన బాంబ్ ఏదైనా ఉందంటే అది ఈ బాంబే. ఉక్రెయిన్ పై ఈ బాంబును ప్రయోగించేందుకు రష్యా తహతహలాడుతోందని అమెరికా, బ్రిటన్ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఆ బాంబును గానీ ఉక్రెయిన్ పై రష్యా ప్రయోగిస్తే దాని పర్యవసానాలు మామూలుగా ఉండవన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ను ప్రయోగించే మిసైల్ లాంచర్ వ్యవస్థలను ఉక్రెయిన్ కు రష్యా తరలించింది. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. నిన్ననే ఆ మిసైల్ లాంచర్లను యుద్ధ రంగంలోకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పంపించారని చెబుతున్నారు.
అసలేంటీ బాంబు.. ఎందుకంత భయం?
రష్యా తయారు చేసిన ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అసలు పేరు టీవోఎస్. దాంట్లోనే రష్యా మూడు వెర్షన్లను తయారు చేసుకుంది. టీవోఎస్–1 బురాటినో, టీవోఎస్ – 1ఏ సోల్న్ ట్సెపక్ (మండే సూర్యుడు), టీవోఎస్ 2 వెర్షన్లున్నాయి. ఈ బాంబులు ‘థర్మోబారిక్’ వర్గానికి చెందినవి. ఇప్పుడున్న సంప్రదాయ బాంబులతో పోలిస్తే ఈ థర్మోబారిక్ బాంబులు చాలా భిన్నమైనవి.
సంప్రదాయ బాంబుల్లో 25 శాతం పేలుడు పదార్థం, అది మండి పేలేందుకు వీలుగా 75 శాతం ఆక్సిడైజర్లను వాడుతుంటారు. కానీ, ఈ థర్మోబారిక్ బాంబుల్లో మొత్తంగా పేలుడు పదార్థాలనే వినియోగిస్తారు. బాంబును ప్రయోగించాక టార్గెట్ ను చేరే క్రమంలో మన చుట్టూ ఉండే గాలిలోని ఆక్సిజన్ ను వాడుకుని టార్గెట్ కు అతి చేరువలో గాల్లోనే అది పేలుతుంది.
తద్వారా ఊహకందని ఉష్ణోగ్రతలను విడుదల చేస్తుంది. టార్గెట్ లో ఉన్నవారి ఎముకలు కూడా దొరకనంత విధ్వంసాన్ని సృష్టిస్తుంది. పేలిన చోట 300 మీటర్ల నుంచి 600 మీటర్ల దాకా దాని ప్రభావం ఏర్పడుతుంది. ఆక్సిజన్ మొత్తాన్ని పీల్చేస్తుంది. ఏమీ లేని ఖాళీ (వాక్యూమ్)ను ఏర్పరుస్తుంది. అందుకే వీటిని ‘వాక్యూమ్ బాంబ్స్’ అని, ‘ఏరోసాల్ బాంబ్స్’ అని, ‘ఫ్యూయెల్ ఎయిర్ ఎక్స్ ప్లోజన్ (ఎఫ్ఏఈ) బాంబ్స్’ అనీ రకరకాల పేర్లతో పిలుస్తుంటారు.
పేలినప్పుడు ఏర్పడే తీవ్రత ఒకెత్తయితే.. పేలాక దాని ప్రభావం మరో ఎత్తు. బాంబు పేలాక ఏర్పడే వేవ్స్ వల్ల దాని చుట్టుపక్కల కిలోమీటర్ పరిధిలోని జనాలపై పెను విధ్వంసమే అది సృష్టిస్తుంది. ఆ వేవ్స్ వల్ల కర్ణభేరి, ఊపిరితిత్తులు పగిలిపోతాయని, మెదడు కణజాలం దెబ్బతింటుందని, చూపు పోతుందని, లోపలి అవయవాలు ఛిద్రం అయి చిత్రవధ చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ బాంబులను అత్యంత ప్రమాదకరమైనవని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆక్షేపించాయి. వాటి వినియోగాన్ని నిషేధించాలని కోరాయి. ఇప్పుడు ఆ వెపన్ నే రష్యా తరలించడం ఆందోళనలను రేకెత్తిస్తోంది.
అమెరికా దగ్గర మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్
వాస్తవానికి ఒక్క రష్యానే కాదు.. శక్తిమంతమైన సైన్యాలున్న దేశాలు వాటిని తయారు చేసుకుంటున్నాయి. మొదటగా ఈ థర్మోబారిక్ బాంబులను రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగానే వెలుగులోకి తీసుకొచ్చారు. అమెరికా, జర్మనీ, రష్యా వంటి దేశాలు వాటిని సిద్ధం చేసుకున్నాయి.
అమెరికా దగ్గర ఈ థర్మోబారిక్ బాంబుల చాలా రకాల వెర్షన్లున్నాయి. కానీ, వాటికి మించి మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ను ఆ దేశం తయారు చేసుకుంది. జీబీయూ 43/బీగా పిలిచే ఆ బాంబును మ్యాసివ్ ఆర్డ్ నెన్స్ ఎయిర్ బ్లాస్ బాంబ్ అనీ పిలుస్తుంటారు. దాని బరువు 9,797 కిలోలు కాగా.. 11 టన్నుల టీఎన్టీ (ట్రైనైట్రో టోలీన్) బాంబులను పేలిస్తే వచ్చేంత తీవ్రతను అది వెలువరిస్తుంది. 150 నుంచి 300 మీటర్ల వరకు దాని ప్రభావం ఉంటుంది. బాంబు తయారీ ఖర్చు 1.28 కోట్ల డాలర్లు.
అమెరికా తయారు చేసిన ఈ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ కు రష్యా తయారు చేసిన ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ రెండింతల శక్తిమంతమైనది. టీవోఎస్ బరువు 7,057 కిలోలుండే దీని తీవ్రత.. 44 టన్నుల టీఎన్టీని పేలిస్తే ఏర్పడేంత తీవ్రతకు సమానం. దీని వెర్షన్లను బట్టి ప్రభావ తీవ్రత 300 మీటర్ల నుంచి 600 మీటర్ల వరకు ఉంటుంది.
మన దగ్గర కూడా ఒక థర్మోబారిక్ బాంబ్ ఉంది. అయితే, అమెరికా, రష్యా దగ్గర ఉన్నవాటంత శక్తిమంతమైనది మాత్రం కాదు. ఎంబీటీ అర్జున్ కంబాట్ ట్యాంక్ లలో వాడేందుకు వీలుగా పెనట్రేషన్ కమ్ బ్లాస్ట్ (పీసీబీ), థర్మోబారిక్ (టీబీ) బాంబులను డీఆర్డీవో (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ)కు చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ (ఏఆర్డీఈ) రూపొందించింది. బంకర్లు, సిటీ యుద్ధ పరిస్థితులు, శత్రువులు దాక్కున్న బిల్డింగులను టార్గెట్ చేసుకుని పేల్చేసేలా వీటిని రూపొందించారు.