గవర్నర్ ప్రసంగం లేదు.. తొలి రోజే తెలంగాణ బడ్జెట్
గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాల ప్రారంభం
అందుకు విరుద్ధంగా ఈ దఫా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
తొలి రోజుననే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి హరీశ్ రావు
అసలే బీజేపీ పై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ సర్కార్ మరో కొత్త వివాదానికి తెరలేపుతుందా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు . బడ్జెట్ సమావేశాలకు ముందు సంప్రదాయం ప్రకారం గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు కానీ ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం .ప్రగతి భవన్ సీఎం అధ్యక్షత జరిగిన అత్యోన్నత స్థాయిసమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఓ సరికొత్త సంప్రదాయానికి తెర తీసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఏ ప్రభుత్వమైనా గవర్నర్ ప్రసంగంతో మొదలుపెడుతుంది. అనాదిగా ఈ సంప్రదాయం వస్తోంది. అయితే ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టేసిన టీఆర్ఎస్ సర్కారు.. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మొదలుపెట్టేందుకు నిర్ణయించింది.
ఈ మేరకు సోమవారం ప్రగతి భవన్‌లో అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయిన సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమావేశాల తొలి రోజుననే వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు మార్చి 7న తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.