పాదయాత్రలు చేసినా, మోకాలి యాత్రలు చేసినా అవి కాశీ యాత్రలే అవుతాయి: బీజేపీ నేతలపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్ !
- పాదయాత్రలతో ఫలితం శూన్యమన్న జగదీశ్ రెడ్డి
- ప్రస్తుతం అన్ని యాత్రలు ఢిల్లీ వైపేనని వెల్లడి
- మోదీని గద్దె దింపడమే ప్రధాన చర్చ అని వివరణ
తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పైనా, ఇతర బీజేపీ నేతలపైనా ధ్వజమెత్తారు. తెలంగాణలో ఎవరెన్ని యాత్రలు చేసినా ఫలితం శూన్యమని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. పాదయాత్రలు చేసినా, మోకాలి యాత్రలు చేసినా ప్రయోజనం ఉండదని, అవి కాశీ యాత్రలే అవుతాయని వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల యాత్రలు ఢిల్లీవైపేనని పేర్కొన్నారు.
ఢిల్లీ కోట నుంచి బీజేపీని దించాలన్నదే దేశంలో ప్రధాన చర్చ అని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ సర్కారును దించాలన్నది దేశ ప్రజల నిర్ణయం అని ఉద్ఘాటించారు. 2014కు ఏముంది, ఆ తర్వాత ఏం జరిగింది, ఈ ఎనిమిదేళ్లలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందన్నది ఈ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని పేర్కొన్నారు.
“ఎవరి కోసం చేస్తాడు పాదయాత్ర? ఏం చేస్తే ప్రజల వద్దకు వెళతాడు? ప్రజలకు చెప్పడానికి ఏంచేశారు గనుక? కేసీఆర్ తెచ్చిన పథకాల్లో ఒక్కటైనా గుజరాత్ లో ఉందా? మధ్యప్రదేశ్ లో ఉందా? ఉత్తరప్రదేశ్ లో ఉందా? గుజరాత్ లో ఒక్క నిమిషం కూడా ఉచిత విద్యుత్ ఇవ్వలేకపోతున్నారు. పాదయాత్రకు వెళ్లి ఏమని చెబుతాడు? మీరు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల గురించి చెబుతారా? ఇంకో వంద పెంచుతామని చెబుతారా? ఇంకెన్ని యాత్రలు చేసినా ఇక్కడే కాదు, దేశంలోనూ వాళ్ల ఆటలు చెల్లవు” అంటూ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.