రేర్ ఫొటో!.. ఏపీ సీఎంతో సీఎం రమేశ్!
- ఆది నుంచి రాజకీయ ప్రత్యర్థులుగానే జగన్, రమేశ్
- పోలవరం వద్ద షెకావత్‌తో భేటీకి సీఎం రమేశ్
- జగన్ ఉండగానే షెకావత్ వద్దకు బీజేపీ నేతలు
- అందరూ కలిసి గ్రూప్ ఫొటో
- జగన్ వైపే నిలబడ్డ సీఎం రమేశ్
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కలిసి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు సందర్శనలో ఓ ఫొటో ఇట్టే ఆకట్టుకుంటోంది. ఆది నుంచి వైరివర్గాలుగానే ఉంటూ వస్తున్న జగన్, బీజేపీ నేత సీఎం రమేశ్‌లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. జగన్, షెకావత్‌ల పోలవరం పర్యటనలో అన్ని ఫొటోల కంటే ఈ ఫొటోనే అందరినీ ఆకట్టుకుంది.
సీఎం జగన్, సీఎం రమేశ్.. ఇద్దరూ కడప జిల్లాకు చెందిన వారే. జగన్ తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉంటే.. సీఎం రమేశ్ టీడీపీలో కొనసాగారు. ఆ తర్వాత జగన్ కాంగ్రెస్‌ను వదిలేసి వైఎస్సార్సీపీ పేరిట కొత్త పార్టీ పెట్టుకోగా.. 2019 ఎన్నికల తర్వాత వేగంగా చోటుచేసుకున్న సమీకరణాల్లో భాగంగా టీడీపీని వదిలేసిన సీఎం రమేశ్ బీజేపీలో చేరిపోయారు. వైసీపీ, బీజేపీల మధ్య స్నేహ సంబంధాలే ఉన్నా..రాష్ట్ర విషయానికి వచ్చేసరికి ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. మొత్తంగా ఎటు చూసినా..ఆది నుంచి రాజకీయ ప్రత్యర్థులుగానే సాగుతున్న జగన్, సీఎం రమేశ్‌లు ఒకే ఫ్రేమ్‌లో ఇమిడిపోయారు.
ఇక ఈ ఫొటో ఎలా సాధ్యమైందంటే.. షెకావత్ కేంద్ర మంత్రి అయినా బీజేపీ నేతే కదా. కేంద్ర మంత్రి హోదాలో ఏపీ పర్యటనకు వచ్చినా..తన పార్టీ నేతలను కలుస్తారు కదా. ఇందులో భాగంగానే బీజేపీ స్థానిక నేతలతో భేటీకి షెకావత్ అంగీకరించగా..పోలవరం పరిధిలోనే ఈ భేటీకి ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా షెకావత్ వద్దకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో కలిసి సీఎం రమేశ్, విష్ణువర్ధన్ రెడ్డిలు రాగా… జగన్ వద్ద ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌లు ఉండగా..అందరూ గ్రూఫ్ ఫొటో దిగగా.. ఈ ఫొటోలో సీఎం రమేశ్ జగన్ వైపే నిలబడటం గమనార్హం.