సస్పెన్షన్‌ను బీజేపీ నేతలు కోరుకున్నారు: హరీశ్ రావు!
- వెల్‌లోకి వచ్చిన 12 మంది ఎంపీల సస్పెన్షన్
- ఢిల్లీలో ఓ న్యాయం.. తెలంగాణలో మరో న్యాయమా?
- వెల్‌లోకి వస్తే సస్పెన్షన్ తప్పదని ఇదివరకే హెచ్చరిక
- సస్పెండ్ కావాలనే బీజేపీ ఎమ్మెల్యేలు వెల్‌లోకి వచ్చారన్న మంత్రి హరీశ్ రావు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలి రోజుననే బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాలు సంప్రదాయం ప్రకారం గవర్నర్ ప్రసంగంతో మొదలవుతాయని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యేలు.. కేసీఆర్ సర్కారు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని, గవర్నర్ ప్రసంగం లేకుండా సభనెలా ప్రారంభిస్తారని ప్రశ్నిస్తూ సభలో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో వెల్‌లోకి దూసుకువచ్చిన ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌లను స్పీకర్ బడ్జెట్ సమావేశాల నుంచి సస్సెండ్ చేశారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆర్థిక మంత్రి హరీశ్ రావు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై స్పందించారు.
బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి సస్పెండ్ కావాలన్న లక్ష్యంతోనే సభకు వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. వెల్‌లోకి దూసుకువచ్చిన 12 మంది రాజ్యసభ సభ్యులను చైర్మన్ సభ నుంచి సస్పెండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా హరీశ్ ప్రస్తావించారు. ఢిల్లీకి ఓ న్యాయం, తెలంగాణకు ఓ న్యాయమా? అంటూ ప్రశ్నించారు.
అసలు వెల్‌లోకి ఏ పార్టీ సభ్యుడు వచ్చినా సస్పెన్షన్ వేటు తప్పదని గత సమావేశాల సందర్భంగానే అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు చెప్పామని తెలిపారు. ఈ క్రమంలో వెల్‌లోకి వెళితే ఎలాగూ తమను సస్పెండ్ చేస్తారన్న ఉద్దేశ్యంతోనే బీజేపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారని ఆయన వ్యాఖ్యానించారు.