బీజేపీ గెలుపు బలమేంటో చెప్పిన దీదీ!
- ప్రత్యామ్నాయం లేకపోవడమే బీజేపీ బలం
- అదే ఏర్పాటైతే బీజేపీకి ఓటమి తథ్యమే
- ప్రత్యామ్నాయం దిశగా యత్నాలు
- ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావాలన్న దీదీ
కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ బలం ఏమిటో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పేశారు. కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయమంటూ ప్రస్తుతానికి ఏదీ లేదని చెప్పిన దీదీ.. ఆ ప్రత్యామ్నాయం లేకపోవడమే బీజేపీకి వరంగా మారిందని తేల్చేశారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఎదురొడ్డి నిలిచే సత్తాను కోల్పోవడం కూడా బీజేపీకి బలంగానే మారిందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇక బీజేపీ ఎప్పుడు ఓడిపోతుందన్న విషయాన్ని కూడా తేల్చి చెప్పిన దీదీ.. బీజేపీకి ప్రత్యామ్నాయం ఏర్పాటు అయిన మరుక్షణమే ఆ పార్టీకి ఓటమి తప్పదని అన్నారు. ఆ దిశగా ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయని, పలు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే వేదికపైకి వస్తే.. బీజేపీ పతనం మొదలైనట్లేనని దీదీ చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.