బీజేపీ జనసేనకు రోడ్ మ్యాప్ పై సిపిఐ నారాయణ అభ్యంతరం!
-వైసీపీతో బీజేపీ సహజీవనం చేస్తుందంటున్న నారాయణ
-మధ్యలో పవన్ కల్యాణ్ కు రోడ్ మ్యాప్ ఎందుకిస్తుంది
-వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చనన్న పవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం
-కమ్యూనిస్టుల బలం చాలా తగ్గిపోయిందన్న నారాయణ
-మరి పవన్ కళ్యాణ్ ఎవరితో సహజీవనం చేస్తున్నారో స్పష్టం చేయని నారాయణ
2019 ఎన్నికల్లో జనసేనలో సహజీవనం చేసిన సిపిఐ పార్టీ ఇప్పుడు తిరిగి ఆయన నుంచి ఎదో ఆశిస్తున్నట్లు సిపిఐ జాతీయకార్యదర్శి నారాయణ మాటలను బట్టి అర్థం అవుతుంది. కమ్యూనిస్ట్ పార్టీలు ఒకసారి ఆయనతో కలిసి పోటీ చేశాయి. చివరకు మాయావతి దగ్గరకు వెళ్లి ఆమె ఫోటో కూడా వాడు కున్నారు . అలాంటి పవన్ కళ్యాణ్ గురించి మిగతావాళ్ళు కన్నా లెఫ్ట్ పార్టీలకే ఎక్కువ తెలిసి ఉండాలి .
పవన్ కళ్యాణ్ లక్ష్యం అధికారం చేపట్టడం … అందుకు ఏ శక్తులు అవసరమైతే వారితో కలిసి నడవడం …బీజేపీ ,టీడీపీ ని కలిపి ఫ్రంట్ కట్టాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు . మరి బీజేపీ ఉండే ఫ్రంట్ లో లెఫ్ట్ పార్టీలు ఉండవు . నారాయణ సూత్రీకరణ ప్రకారం బీజేపీ ,వైసీపీ ఒకటైతే పరిణామాలు ఏవిధంగా ఉంటాయనేది ఆలోచించాల్సిందే . కేంద్రం లో ఉన్న బీజేపీ సహాయం లేకుండా తన లక్ష్యం నెరవేరదని పవన్ భావిస్తున్నారు . అలాంటప్పుడు బీజేపీ వ్యతిరేక శిభిరంలో పవన్ ఉంటారా ? అనేది ఇక్కడ ప్రశ్న ? మరి బీజేపీ లేని ఫ్రంట్ కోరుకొనే వామపక్షాలు పవన్ ను బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ లో ఉండేలా చూడగలుగుతాయా ? అంటే అది ప్రస్నార్ధకమే ?
ఇటీవల జనసేన ఆవిర్భావ వేడుకల సందర్భంగా జరిగిన సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తానని ప్రకటించారు . ఇది వైసీపీ వ్యతిరేక శక్తులను సంతోష పెట్టె విషయమే కానీ ఒకపక్క బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ దాన్ని వదులుకొని టీడీపీ తో జత కడతారా ? నారాయణ చెప్పినట్లు బీజేపీ , వైసీపీ ఒకటే అనుకుందాం అలాంటప్పుడు జనసేన బీజేపీతో ఎందుకు ప్రయాణం చేస్తుందో కూడా చెప్పాల్సి ఉంది. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండే ఫ్రంట్ లో కమ్యూనిస్ట్ లు ఉంటారా ? అందుకు పవన్ కళ్యాణ్ , టీడీపీ నేత చంద్రబాబు అంగీకరిస్తారా ? అప్పుడు సీఎం అభ్యర్థి ఎవరు చంద్రబాబా ? పవన్ కళ్యాణా ? ఇందులో అనేక చిక్కు ముడులు ఉన్నాయి. ఇది అంట తొందరగా తేలే విషయం కాదు …
వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రయత్నం చేయనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందిస్తూ… పవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని చెప్పారు. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపుతానన్న పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ… వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వదని… బీజేపీ, వైసీపీలు సహజీవనం చేస్తున్నాయని అన్నారు. వైసీపీతో సహజీవనం చేస్తున్న బీజేపీ మధ్యలో పవన్ కల్యాణ్ కు రోడ్ మ్యాప్ ఎందుకిస్తుందో అర్థం కావడం లేదని చెప్పారు.
బీజేపీ విషయంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు నోరెత్తకపోవడం బాధాకరమని నారాయణ అన్నారు. వైసీపీ నేతలు ఢిల్లీలో భరతనాట్యం చేస్తూ, ఏపీకొచ్చి శివతాండవం చేస్తారని ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్త పడాలని సూచించారు. మన దేశంలో కమ్యూనిస్టు పార్టీల బలం చాలా తగ్గిపోయిందని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్నప్పుడు అన్ని పార్టీలు తమ వద్దకు వచ్చేవని… ఇప్పుడు బలం తగ్గడం వల్ల ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.