హోలీ వేడుకల ఎఫెక్ట్!.. రెండు రోజులపాటు మద్యం బంద్!
- మూతపడనున్న బార్లు, క్లబ్బులు
- హైదరాబాద్‌లో పోలీసుల ఆంక్షలు
- వైన్‌షాపులకు మందు బాబుల పరుగులు
రంగుల కేళి హోలీ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో పలు ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. వీటిలో ప్రధానంగా మందు బాబులకు రెండు రోజుల పాటు పస్తులు తప్పదన్న వార్త ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. హోలీ వేడుకల నేపథ్యంలో నగరంలో రెండు రోజుల పాటు మద్యం విక్రయాలు నిలిచిపోవడంతో పాటు బార్లు, క్లబ్బులు మూతపడనున్నాయి. ఈ మేరకు కాసేపటి క్రితం నగర పోలీసులు నిషేధాజ్ఞలను ప్రకటించారు.
పోలీసుల ప్రకటన ప్రకారం, గురువారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాలు బంద్ కానున్నాయి. అదే సమయంలో మద్యం సరఫరా చేసే బార్లు, క్లబ్బులు కూడా మూతపడనున్నాయి. ఇక బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలను పోలీసులు నిషేధించారు. అపరిచిత వ్యక్తులు, వాహనాలు, భవనాలపై రంగులు పోయడాన్ని కూడా పోలీసులు నిషేధించారు.
మిగిలిన ఆంక్షల మాటెలా ఉన్నా.. రెండు రోజుల పాటు మద్యం విక్రయాలు బంద్ కానున్నాయన్న వార్త క్షణాల్లో నగరమంతా వ్యాపించింది. దీంతో రెండు రోజులకు సరిపడా మద్యం కోసం మందుబాబులు వైన్ షాపుల ముందు క్యూ కట్టారు. ఫలితంగా నగరంలోని దాదాపుగా అన్ని వైన్ షాపుల వద్ద భారీ రద్దీ నెలకొంది.